టి సర్కార్ కి రేవంత్ షాక్ ఇస్తారా ...?

ఓటుకు నోటు కేసుతో తన రాజకీయ జీవితాన్ని బజారుకు ఈడ్చిన కేసీఆర్ సర్కార్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కసితో ఇంకా రగిలిపోతూనే వున్నారు. తనకు జరిగిన అవమానాలన్నీ కేసీఆర్ కు రుచి చూపించాలన్న పట్టుదలతో రేవంత్ నిత్యం టి సర్కార్ చేస్తున్న అన్ని పనులపై నిఘా పెట్టి కోర్ట్ కు ఈడుస్తున్నారు. తాజాగా రేవంత్ టి సర్కార్ పై ఢిల్లీ హై కోర్ట్ లో వేసిన పిటిషన్ పని జరిగేలాగే వుంది. గతంలో టీఆర్ఎస్ సర్కార్ ప్లీనరీ నిర్వహించింది. ఈ ప్లీనరీ సమయంలోనే నోట్ల రద్దు జరగడంతో నగదు చేతిలో లేక అంతా అల్లాడిపోయారు. పెద్ద నోట్ల రద్దు కావడంతో కోటీశ్వరులు సైతం క్యాష్ కి కటకటలాడిపోయారు.
గులాబీ కూలీ ప్లాన్ వేసిన కేసీఆర్ ...
ప్లీనరీని విజయవంతం చేయాలంటే ఎలా అన్న ఆలోచన నుంచి కేసీఆర్ ఒక అద్భుత ప్లాన్ పార్టీకి అప్పగించారు. ఈ ప్లాన్ ప్రకారం మంత్రులనుంచి గల్లీలీడర్లు వరకు అంతా ఏదో ఒక పని చేసి ఆ కూలి డబ్బులను పార్టీకి అందివ్వాలన్నది ఈ కాన్సెప్ట్. ఇది బాగానే వర్క్ అవుట్ అయ్యింది. నేతలు ప్రతి వ్యాపారి దగ్గర నుంచి వేలు లక్షల రూపాయలను కూలీగా సంపాదించేశారు. ఖుషీ ఖుషీగా గులాబీ ప్లీనరీ సాగిపోయింది. ఇక్కడ దాకా బానే వుంది. ఈ దందా పై నాడు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వున్న రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. కానీ అక్కడ ఈసీ స్పందించకపోవడంతో రేవంత్ కి చుక్కెదురైంది. అయినా పట్టు విడవకుండా ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు ఆయన. ఇప్పుడు కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎందుకు చర్యలు చేపట్టలేదని నిలదీసింది. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇతర పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాలను చట్టబద్ధ సంస్థలను ఉపయోగించుకుని వారిని చేతులు కట్టేలా చేస్తున్న కేంద్రంలోని మోడీ సర్కార్ తమకు అందివచ్చే ఈ అస్త్రాన్ని ఎలా వాడుతుందో అన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుంది
- Tags
- రేవంత్ రెడ్డి

