జిల్లాల ఏర్పాటు డిమాండ్లు ఇంకా వినిపిస్తున్నాయ్

తెలంగాణరాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి చాలా కాలం అయిపోయినట్లే లెక్క. మొత్తం 31 జిల్లాలతో సరికొత్త తెలంగాణ పరిపాలన సాగుతోంది. కొత్తజిల్లాలు సమస్త మౌలిక వసతులను కూడా సమకూర్చుకుంటున్నాయి. ఎక్కడికక్కడ జిల్లా కార్యాలయ భవనాలు ఏర్పాటవుతున్నాయి. వ్యవస్థ మొత్తం గాడిన పడిపోతున్న సమయంలో ఇంకా కొత్తజిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు డిమాండ్లు వినిపించడం అనేది ఆశ్చర్యమే. పైగా.. సాధారణంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినా కూడా.. ప్రాక్టికల్ గా ఉండే డిమాండ్ల గురించి మాత్రమే మాట్లాడే అలవాటు ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ ఇంకా కొన్ని గిరిజన ప్రాంతాల పేర్లు చెప్పేసి వాటిని అనుసంధానిస్తూ విడిగా ఒక జిల్లా ఉండాలని కోరడం ఆశ్చర్యకర డిమాండ్ గానే కనిపిస్తోంది.
జయశంకర్ జిల్లా ములుగులో విపక్షా ఆధ్వర్యంలో జరిగిన ములుగు ఆత్మగౌరవ సభలో ప్రొఫెసర్ కోదండరాం కూడా పాల్గొన్నారు. అయితే వాజేడు, వెంకటాపురం, ములుగు, భద్రాచలం వంటి గిరిజన ప్రాంతాల ఆధారంగా జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదంటూ ఇప్పుడు ఓ కొత్త పాయింటును లేవనెత్తారు. అయితే జిల్లాల ఏర్పాటు అనేది ముగిసిపోయిన అంశం అనుకుంటున్న తరుణంలో ఇంకా ఆ పాయింటుమీద ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది చిత్రంగా కనిపిస్తోంది.
ఎందుకంటే కొత్త జిల్లాల విషయంలో కేసీఆర్ సర్కారు ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యంతరాలను స్వీకరించింది. ముందుగా అనుకున్న దానికంటె కూడా.. సంఖ్య పెరిగినా సరే.. వేర్వేరు ప్రాంతాల ప్రజల సెంటిమెంటును, డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని.. యథేచ్ఛగా జిల్లాల ఏర్పాటు చేశారు కేసీఆర్. సరిగ్గా ఆ కసరత్తు జరుగుతున్న సమయంలోనే , ప్రొఫెసర్ సాబ్ కు ఇలాంటి ఆలోచన ఉంటే బయటపెట్టి ఉండాల్సింది. గట్టిగా పోరాడాల్సింది. అయితే.. అంతా అయిపోయిన తర్వాత.. ఇప్పుడు గిరిజన ప్రాంతాలంటూ ఇలాంటి డిమాండ్ తేవడం వల్ల.. ఏదో ప్రభుత్వాన్ని గిరిజన వ్యతిరేకంగా ముద్ర వేయడానికి ఉపయోగపడుతుందే తప్ప.. వాస్తవంలో.. పనిజరగడానికి ఉపయోగపడదని అంతా అనుకుంటున్నారు. అన్ని విషయాల్లో ప్రాక్టికల్ ఆలోచనతో ఉద్యమాలు చేస్తూ ఉండే కోదండరాం ఇలా మాట్లాడడం ఏంటని భావిస్తున్నారు.

