జానా... తీరు మార్చుకోకుంటే?

కాంగ్రెస్ శాసనసభ్యులు సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీచీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు... నిలదేసే పరిస్థితికివచ్చారు. ప్రతి అసెంబ్లీ సమావేశాలకు ముందు శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. అయితే ఈసారి జరిగిన శాసనసభపక్ష సమావేశాల్లో ఎమ్మెల్యేలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్యేలు వీరిని కోరారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో మాదిరిగా కామ్ గా కూర్చుంటే కుదరదని ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. ప్రతి అంశంపై ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టేలా చూడాలని వారు కోరారు. ప్రభుత్వానికి వత్తాసు పలకడం మానుకోవాలని జానారెడ్డిని గట్టిగానే కోరారు. అలాగే ప్రతి దానికి అఖిలపక్షం వెంటపడొద్దంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు సూచించారు.
ఉత్తమ్ నూ నిలదీసిన నేతలు......
ఇటీవల పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి అంశంపైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిలపక్షం వెంట వెళుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సొంతంగా మైలేజీ రావడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పనిచేపట్టినా అఖిలపక్షంతో వెళ్లడమేంటని పీసీసీ చీఫ్ ను దాదాపు నిలదీసినంత పరిస్థితి చేశారు ఎమ్మెల్యేలు. ప్రధాన ప్రతిపక్షం అన్న మాట మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. తమ వెంట ఇతర పక్షాలను తిప్పుకోవాల్సి ఉండగా, తాము ఇతరుల వెళ్లడమేంటని గట్టిగానే నిలదీశారు. గతంలో జేఏసీ వెంట వెళ్లి తెలంగాణ ఉద్యమంలో వెనక్కు పడిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేశారు. ఇకపై ఇతర పక్షాలను తమ వెంట నడిచేలా చూడాలని కోరారు. అలాగే సీఎల్పీ నేత జానారెడ్డి కూడా వ్యవహారశైలిని మార్చుకోవాలని కోరారు. ఆయన అధికార పక్షంపై మెతక వైఖరిని వ్యవహరిస్తున్నారని, కఠినంగా ఉండాలని కోరారు. జానా తీరు మార్చుకోకుంటే ఎప్పటి లాగానే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార పక్షానిదే పై చేయి అవుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీ నేతలు వివిధ అంశాలపై ప్రసంగించేటప్పుడు మిగిలిన నేతలు సమావేశాల నుంచి బయటకు వెళ్లకుండా సభలోనే ఉండి మద్దతుగా నిలవాలన్నారు. ఇక అధికార పార్టీపై మెతక వైఖరిని అవలంబిస్తే ప్రజల్లో కూడా చులకనవుతామని చెప్పారు. కేసీఆర్ హామీలు ఏ ఒక్కటీ అమలుకు నోచుకోవడం లేదని, వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ అయ్యారు. చూద్దాం.... జానా తీరులో మార్పు వస్తుందో...రాదో.
- Tags
- జానారెడ్డి

