జస్టిస్ చలమేశ్వర్ వ్యాఖ్యలు వీరి కోసమేనా ...?

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి పై నేరుగా అభియోగాలు చేసి న్యాయవ్యవస్థను కాపాడాలంటూ రోడ్డెక్కి దేశ వ్యాప్త సంచలన వ్యాఖ్యలు చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన వారసత్వ రాజకీయాలను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు టిడిపి వైసిపి కాంగ్రెస్ టిఆర్ఎస్ వర్గాలకు రుచించని విధంగా వున్నాయి. దేశంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టత్వానికి వారసత్వ రాజకీయాలే కారణమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ కుండ బద్దలు కొట్టేలా చెప్పేశారు. కుటుంబంలో దేశంకోసం ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తే ఆ కుటుంబం మొత్తం రాజకీయాల్లో కొనసాగినప్పుడు ఆదరించడం ప్రజలు మానుకోవాలని హితవు పలికారు చలమేశ్వర్. తరతరాలుగా రాజకీయ వారసత్వం అన్నది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు ఆయన. ఇక్ష్వాకుల కాలం నుంచి ఈ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని విశ్లేషిస్తూ దేశాభివృద్ధికి ఈ తరహా మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
చలమేశ్వర్ వ్యాఖ్యలపై చర్చ ...
జస్టిస్ చలమేశ్వర్ విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారి తీశాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ లో వారసత్వ రాజకీయాలే జోరుగా నడుస్తున్నాయి. తెలంగాణ లో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు లను బాగా ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ తరువాత వారసుడు కేటీఆర్ అన్నది ఆ రాష్ట్ర ప్రజలకు సుస్పష్టం. అలాగే ఏపీలో చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. బావమరిది వియ్యంకుడు బాలకృష్ణ హిందూ పురం ఎమ్యెల్యేగా వున్నారు. ఇక మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్ తండ్రి వారసత్వంగానే ప్రజల్లోకి వచ్చి పార్టీ పెట్టి ముందుకు వెళుతున్నారు. ఎన్టీఆర్ వారసురాలిగా దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వీరు కాక రాహుల్ గాంధీ నెహ్రు, ఇందిరా, రాజీవ్ వారసుడిగా అరంగేట్రం చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే చలమేశ్వర్ వ్యాఖ్యలు వీరి అందరిని ఉద్దేశించి చేసినవా లేక కేవలం జాతీయ వారసత్వ రాజకీయాలపైనా? అన్న చర్చ నడుస్తుంది. వారసత్వం అన్నది ఎక్కడైనా ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న సందేశాన్ని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.

