జయ పరామర్శలన్నీ డాక్టర్ల వరకే పరిమితం

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించడానికి ప్రతిరోజూ ఒక్కొక్క రాష్ట్రం నుంచి సీఎం, గవర్నర్ స్థాయి ప్రముఖులు వస్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నారు. ఆమె కోలుకుంటున్నదని చెబుతూనే ఉన్నారు. అయితే ఆస్పత్రి వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. పరామర్శ పేరుతో వస్తున్న ఏ ఒక్కరినీ కూడా జయలలిత బెడ్ వద్దకు కూడా అపోలో వైద్యులు అనుమతించడం లేదుట. ఆమె ఉన్న అద్దాల గది బయటినుంచి చూసి.. అక్కడితో సంతృప్తి చెంది వచ్చేయాల్సిందేనట. వచ్చిన ప్రముఖులందరూ దూరం నుంచి జయను చూడడం.. డాక్టర్లతో అరగంటకు పైగా మాట్లాడడం బయటకు వచ్చి.. జయలలితను పరామర్శించేశాం అన్నంత బిల్డప్ తో మీడియా ముందు ఆమె కోలుకుంటున్నారనే ప్రకటన చదివేసి వెళ్లిపోవడం జరుగుతోంది.
జయలలిత పరామర్శలకు ప్రముఖుల రాకపోకలు మొదలైన తర్వాత మొదటగా రాహుల్ గాంధీ వచ్చారు. ఆ మరుసటి రోజు ప్రధాని నరేంద్రమోదీ వస్తారనే ప్రచారం జరిగింది. అయితే అపోలో వైద్యుల ద్వారా.. జయలలిత ను వ్యక్తిగతంగా పరామర్శించేంత పరిస్థితి లేదనే వాస్తవం తెలుసుకున్న తర్వాత మాత్రమే మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
నిన్నటికి నిన్న పాండిచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ కూడా పరామర్శకు వచ్చారు. ఆమె డాక్టర్లతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత.. అసలు సంగతిని మర్మం విప్పి చెప్పేశారు కూడా. నేను జయలలితను చూడలేదు. కేవలం డాక్టర్లతో మాత్రమే మాట్లాడాను. ఆమె చికిత్సకు స్పందిస్తున్నారు.. అని కిరణ్ బేడీ చెప్పారు.
అయినా.. జయలలిత పరిస్థితి తీవ్రంగా కూడా ఉండవచ్చు గాక.. అయినా దేశంలోని ఎంత పైస్థాయి ప్రముఖులు వచ్చినా కూడా.. కనీసం వారిని దగ్గరకు తీసుకువెళ్లి చూపించలేనంతగా ఏముంటుంది? ఎంతటి వారినైనా దూరం పెట్టడంలో డాక్టర్ల ఉద్దేశం ఏమిటి? వంటి ప్రశ్నలు తలెత్తితే.. మళ్లీ అవి కొత్త పుకార్లకు కారణమౌతాయి.

