జనసైనికుల్లో ఆకాశాన్ని అంటిన జోష్

ఇప్పటివరకు జన సైన్యం అయోమయంలోనే కొట్టుమిట్టాడుతోంది. పవన్ కళ్యాణ్ తిరిగి టిడిపి పొత్తు తో వెళతారని ఆ పార్టీ సైనికులు భావించారు.2014 లో మద్దత్తు ఇచ్చి మోసపోయామని టిడిపి తో జత కడితే బిజెపి లాగే జనసేనను ఎప్పటికి ఆ పార్టీ ఎదగనీయదనేది పవన్ అభిమానుల అంతర్మధనం గా ఉండేది. కానీ తమ అధినేత ఆదేశాలు అనుసరించడం తప్ప మరొకటి చేయలేని స్థితి లో జనసేన కార్యకర్తలు జనం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతం అయ్యేవారు. కానీ గుంటూరు లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సదస్సులో పవన్ పార్టీ కి ఇచ్చిన దిశా దశ ఆ పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ నింపాయి. పొత్తులు లేకుండా జనసేన రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరనుంది అనే విషయం లో స్పష్టత లభించడంతో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోని జనసైనికులు ఉత్సహంతో ఉరకలేస్తున్నారు.
అధికార పార్టీపై పోరాటమే...
ప్రజల అభిమానం పొందాలంటే అధికార పార్టీ చేస్తున్న తప్పులు ఎత్తి చూపుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చెయ్యాలి. అలా కాకుండా విపక్షంపై మాత్రమే వేలెత్తి చూపడంతో గత రెండేళ్లుగా జనసేన ప్రజల్లో కి దూసుకువెళ్ళలేక చతికిల పడింది. అధినేత సైతం అడపాదడపా స్పందించి సినిమాల్లో నటించేందుకు వెళ్ళిపోవడంతో జనసైన్యం నీరసించిపోయింది. ఇప్పుడు అదంతా తుడిచిపెట్టుకుపోయింది. గుంటూరు సభలో చంద్రబాబు సర్కార్ అవినీతి పాలనపై పవన్ నిప్పులు చెరిగారు. ఇసుక మాఫియా నుంచి అన్నింటిపై పోరాడతామని పిలుపునిచ్చారు. ఆ పిలుపు ఇప్పుడు క్యాడర్ అందుకుని ప్రజల్లోకి వెళ్లనుంది.
- Tags
- జనసేన
