జనసేనాని స్పీడ్ పెంచుతున్నారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమాత్రం కొద్దిగా స్లో అయినా అటు పార్టీల నుంచి ఇటు ప్రజలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ నిలదీసేస్తున్నారు. పార్ట్ టైం లో ఉండొద్దు మీరు ఫుల్ టైం రాజకీయాలు చేయండి అని కడిగేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా లో దేశం తమ్ముళ్ళు జనసేన టార్గెట్ గా పవన్ కేంద్రంపై అవిశ్వాసం అంశంలో చెప్పిన మాట ఏమైందంటున్నారు. మరోపక్క జనసేనపై గతంలో విరుచుకుపడిన వైసిపి మాత్రం సైలెంట్ అయ్యింది. టిడిపి జనసేన నడుమ సాగుతున్న మాటల యుద్ధాన్ని ఆ పార్టీ బాగా ఆస్వాదిస్తోంది. కాగల కార్యం అన్నట్లు ఇప్పటికైనా ఇరువురి నడుమ రగిలిన అగ్గి నిజాలను ప్రజలకు తెలిసేలా చేస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనాని కీలకమైన అడుగులు వేయనున్నట్లు తెలుస్తుంది.
కార్యాచరణ సిద్ధం చేయనున్న పవన్ ...
ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ దీక్షకు సైతం దిగుతానంటూ పవన్ కళ్యాణ్ గుంటూరు సభలో హెచ్చరించిన తరువాత నెమ్మదించారు. పవన్ జాతీయ ఛానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ సైతం వివాదాస్పదం అయ్యింది. దానిపై జనసేన ఖండన విడుదల చేయాలిసిన పరిస్థితి ఎదురైంది. హోదా కోసం దేశం అంతా తిరిగి మద్దతు కూడగడతాను అన్న ఆయన మాటను ఆచరణలో అమలు చేయకపోవడం విమర్శలకు గురయ్యేలా చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరరలోనే సీన్ లోకి దిగుతున్నారు. ముందుగా వామపక్షాలతో కార్యాచరణ మొదలు పెట్టారు పవన్. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ,సీపీఎం కార్యదర్శి మధు తో భేటీ అయ్యారు. త్వరలో లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ వంటివారితో సమావేశమై మేధో వర్గంతో కలిసి సుదీర్ఘ కార్యాచరణ సిద్ధం చేసే యోచనలో పవన్ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి ఇప్పుడు అన్ని వర్గాల్లో ఎదురవుతుంది.
