జనంపై జగన్ ఫోకస్ ...!

వైసిపి అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రజా సమస్యలపై లోతుగా దృష్టి పెట్టారు. తన పాదయాత్రలో భాగంగా కాళహస్తి నిజయోజకవర్గంలో పర్యటిస్తున్నారు జగన్. ఈ సందర్భంగా అర్హత వున్నా పెన్షన్ రాని వృద్ధులను, వికలాంగులను, ఆరోగ్యశ్రీ అందని పేద వర్గాలను నేరుగా కలుసుకున్నారు. వారి ఆవేదన దగ్గరుండి విని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రచారం తప్ప ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ధ్వజమెత్తారు విపక్ష నేత. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సత్వరం సమస్యలను పరిష్కరిస్తానని ఆయనహామీ ఇస్తూ వెళుతున్నారు.
పాదయాత్రలో విభిన్నంగా ...
జగన్ పాదయాత్రను ఎప్పటికప్పుడు పంధా మారుస్తున్నారు. ప్రజలతో సభల్లో సమావేశమైనప్పుడు వారితోనే సమస్యలు చెప్పించడం దానిపై తనదైన రీతిలో విమర్శలతో కూడిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై శరపరంపరగా విడిచిపెడుతున్నారు. ఇప్పటివరకు కొరకరాని కొయ్యలుగా వున్న ఆయా నియోజకవర్గాల సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. వాటిని టిడిపి సర్కార్ అలక్ష్యం వహించడాన్ని ఎండగడుతున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతల కన్నా సామాన్యులను కలుసుకోవడానికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. నేతలతో భోజన విరామ సమయంలోనో, రాత్రి బస వద్దనో మాట్లాడుతున్నారు. పాదయాత్ర సమయంలో మాత్రం వారితో మాట్లాడకుండా కేవలం సమస్యలను వింటూ వారికి హామీలను ఇస్తుండటం ప్రత్యేకతగా చెప్పొచ్చు.
పెరుగుతున్న ఆదరణ ...
వైఎస్ జగన్ పాదయాత్రకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఏపీలోని 13 జిల్లాలకు చెందిన వైసిపి అభిమానులు తమ నేత పాదయాత్రలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. వీరితో పాటు స్థానిక నియోజకవర్గాల వైసిపి క్యాడర్ పెద్ద సంఖ్యలో ఆయా ప్రాంతాల ప్రజలు జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. దాంతో జగన్ యాత్రలో జోష్ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. చంద్రబాబు సొంతజిల్లా చిత్తూరులో మంచి రెస్పాన్స్ రావడంతో వైసీపీ నేతల్లో జోష్ పెరిగింది.
- Tags
- జగన్

