జనంతో జగన్ పండగ ...!

సంక్రాంతి పండుగను వైసిపి అధినేత జగన్ ప్రజలతో ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా పారకాల్వ లో జగన్ పాదయాత్ర శిబిరం ఉదయం నుంచి కోలాహలంగా మారిపోయింది. చక్కటి రంగవిల్లులు, పూల అలంకరణలతో ఆ ప్రాంతం అంతా సందడిలో మునిగింది. తమ నాయకుడు పండగ రోజు ఎలా ఉంటాడా అని చూసేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దఎత్తున పారకాల్వ చేరారు అభిమానులు. అందులో మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసారు.
పట్టుపంచె , చొక్కా తో న్యూ లుక్ ...
ప్యాంట్ షార్ట్ తో సాధారణ వస్త్ర ధారణలో నిత్యం పాదయాత్రలో కనిపించే వైసిపి అధినేత పండగ స్పెషల్ చూపించారు. పట్టు పంచె చొక్కా ధరించి అందరికి కనువిందు చేశారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి నూతన వస్త్రాలు అందించారు. తిరుపతి నుంచి ప్రత్యేకంగా రప్పించిన పుంగనూరు దూడకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పశువులకు సంక్రాంతి పండుగకు వున్న అనుబంధానికి గుర్తుగా ఆయన ఈ పూజలు చేసినట్లు వైసిపి వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రం అభివృద్ధి చెందాలి...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో వుండాలని మకర సంక్రాంతి పర్వదినాన భగవంతుడిని కోరుకుంటున్నట్లు జగన్ తన సందేశాన్ని మీడియా ద్వారా రాష్ట్ర వాసులకు అందించారు. ప్రజలతో మమేకం అయ్యి సంక్రాంతి పండగ జరుపుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తన వెంట పాదయాత్రగా వచ్చిన అభిమానులను పేరు పేరునా పలకరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. పారకాల్వ చుట్టుపక్కల నుంచి జగన్ ను చూసేందుకు వచ్చిన పెద్ద సంఖ్యలో మహిళలు విచ్చేసారు. జగన్ అధికారంలోకి రావాలని పండగనాడు ఆకాంక్షిస్తున్నట్లు వారు వెల్లడించారు. ఆయన ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతం కావాలని వారు కోరుకున్నారు. జగన్ తో పాటు మకర సంక్రాంతి వేడుకల్లో వైఎస్ విజయమ్మ, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు ఉండగా రోజా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.
- Tags
- జగన్

