జనం కష్టాలపై చంద్రబాబు శ్రద్ధ : సూచనలివే!

నల్లధనం నియంత్రణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను కేవలం మాటల్లో సమర్థించడం మాత్రమే కాదు.. దానివల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దూరం చేసి కేంద్రం ప్రయత్నానికి సహకరించే పరంగా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రద్ధగా వ్యవహరిస్తున్నారు. రెండు మూడు రోజులుగా ప్రతిరోజూ జనం కష్టాల గురించి ఆయన సమీక్ష్ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే మంగళవారం కూడా నోట్ల ఇబ్బందులపై అత్యవసర సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. కొన్ని కీలకమైన సూచనలు చేశారు.
కరెన్సీ నోట్ల సమస్యపై
ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష – ముఖ్యాంశాలు
1. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా అన్ని అవకాశాలను పరిశీలించాలి. ఈ విషయంలో కెన్యా, నైజీరియా దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి.
2. రైతు బజార్లు, పెట్రోల్ బంకులు, థియేటర్లు, మీసేవ కేంద్రాలు, వ్యాపార కూడళ్లలో తక్షణం వీలైనన్ని ఇ పోస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలి.
3. ఎక్కడ చిల్లర సమస్య తలెత్తినా అధికారుల అప్రమత్తమై సమస్యను పరిష్కరించాలి.
4. నోట్లన్నీ ప్రధాన బ్యాంకుల దగ్గరే ఉంచకుండా మిగిలిన ప్రైవేట్, కోపరేటివ్ బ్యాంకులు అన్నింటికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
5. జిల్లాలలో పరిస్థితిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఇ పోస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలి.
6. చిల్లర సమస్య తలెత్తకుండా ఆలయాల హుండీ ఆదాయాన్ని ఏరోజుకారోజు బ్యాంకుల్లో జమచేసేలా దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలి.
7. ఎలక్ట్రానిక్ కరెన్సీని విస్తృతంగా వినియోగించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలి.
8. కేవలం నగరాలు, పట్టణాలకే నోట్ల సరఫరా పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలి.
9. నోట్ల కొరత అధికంగా వున్న ఉభయగోదావరి, చిత్తూరు, ఒంగోలు, కర్నూలు జిల్లాలపై బ్యాంకర్లు దృష్టిపెట్టాలి.
10. బ్యాంకింగ్ కరెస్పాండెట్లను నియమించుకోవడానికి ఇదే సరైన సమయం, బ్యాంకర్లు ఈదిశగా చర్యలు తీసుకోవాలి.
11. రూ. 500 నోట్లు త్వరిత గతిన రాష్ట్రానికి పంపిణీ చేసేందుకు ఆర్ధిక శాఖ కార్యదర్శి తక్షణం ముంబైలో ఆర్బీఐ అధికారులకు అందుబాటులో వుండాలని ముఖ్యమంత్రి ఆదేశం.

