జగన్ స్ట్రాటజీ వర్క్ అవుటు అవుతుందా?

వైసీపీ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణాలేంటి? శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా అధికారపార్టీపై వత్తిడి పెంచేందుకేనా? 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేంత వరకూ తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమని చెప్పడం వెనక వ్కూహం ఏంటి? అవును.. ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైసీపీ సభకు హాజరుకాకపోతే.... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షమే ఉండదు. గత ఎన్నికల్లో టీడీపీ,వైసీపీ, బీజేపీలు మాత్రమే శాసనసభలోకి అడుగుపెట్టాయి. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఒక్కరూ గెలవకపోవడం, బీజేపీ టీడీపీ మిత్రపక్షాలుగా ఉండటంతో ప్రధాన ప్రతిపక్షం ఒక్క వైసీపీయే అయింది. ఇప్పుడు వైసీపీ కూడా సభకు హాజరుకాకపోతే... ఇక చర్చలకు అవకాశం ఉండదు. ప్రభుత్వం తన గొప్పలు చెప్పుకోవడం... ఒకరిని ఒకరు పొగడుకోవడం తప్పఏమీ ఉండదు. ఒక శాసనసభలో ప్రతిపక్షం లేకుండా సభ జరగడం ఇదే తొలిసారి కాకపోయినా... సమఉజ్జీలుగా ఉన్న వైసీపీ, టీడీపీలు సభలో చర్చ జరిగితేనే ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. ప్రతిపక్షం లేవనెత్తే సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పినా ప్రజలు అది నమ్మే అవకాశముంటుంది. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. సభలో ప్రతిపక్షం లేకుండా సమావేశాలు జరపటం ఏపీ సర్కార్ ను ఇరకాటంలో నెట్టేసిందనే చెప్పాలి.
ఈ సమావేశాలకే పరిమితం కాదు.....
అసెంబ్లీ విడుదల చేసిన బులిటెన్ లో వైసీపీకి 66 మంది ఎమ్మెల్యేలుగా పేర్కొనడం కూడా వివాదంగా మారింది. 66 మందిలో 20 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ చేర్చుకున్నప్పటికీ వారిని ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలుగా చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వారిలో నలుగురు మంత్రులు కూడా ఉండటాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీని మానసికంగా దెబ్బతీసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎన్టీఆర్ పేరును కూడా తెరమీదకు తీసుకొచ్చారు. గతంలో ఎన్టీఆర్ విపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేసి టీడీపీ నోరు మూయించాలన్నది వైసీపీ వ్యూహంగా కన్పిస్తోంది. శాసనసభలో తమను ఆడిపోసుకోవడం తప్ప ప్రజాసమస్యలపై ఎప్పుడైనా చర్చించారా? అన్ని వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే వైసీపీ నుంచి వెళ్లిపోయిన 20 మంది సభ్యులపై చర్యలు తీసుకుంటేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని చెప్పారు. అంటే కేవలం శీతాకాల సమావేశాలకే కాదు... వారిపై అనర్హత వేటు వేసేంత వరకూ తాము అసెంబ్లీలోకి అడుగుపెట్టమని చెప్పకపోవడం స్పీకర్ పైన వత్తిడి పెంచడానికే. మొత్తం మీద జగన్ వ్యూహానికి టీడీపీ దిగివస్తుందా? లేదా? అన్నది చూడాలి.

