జగన్ అడుగులో అడుగు వేస్తే సరి ...?

ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ రోడ్డు మార్గాన వెళుతూ అందరినీ పలుకరిస్తున్నారు. రోడ్డు పక్కన పొలాల్లో పనిచేసుకుంటున్న రైతుల వద్దకు వెళ్లి ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోని గంటావారి పల్లె సమీపంలో వరినాట్లు వేస్తున్న మహిళలను పలకరించారు. వ్యవసాయానికి గిట్టుబాటు అవుతుందా? అని ప్రశ్నించారు. రోజువారీ కూలీ ఎంతవస్తుందని అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర అంతటా ఆయన తన వెంట వచ్చే వారితో కాకుండా ప్రజలతో మమేకం అవుతున్నారు. రోడ్డు పక్కన కన్పించిన ప్రతి వ్యక్తినీ ఆయన ఆప్యాయంగా పలకరించి భుజంమీద చేయి వేసి వెళుతుండటం కన్పించింది.
అన్ని నియోజకవర్గాల నుంచి....
ఇక జగన్ పాదయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు కదిలి వస్తున్నారు. ఒక రోజంతా జగన్ తో ఉండి ఆయనతో నడిచి వెళుతున్నారు. నడుస్తూనే నియోజకవర్గాల్లో పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. గుంటూరు నగరానికి చెందిన నేతలు వచ్చి జగన్ కలిశారు. అలాగే విజయనగరం, ప్రకాశం జిల్లాకు చెందిన పార్టీ నేతలు వచ్చి జగన్ కు సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన నియోజకవర్గాల్లో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక విద్యార్థులు, మహిళలు జగన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జగన్ వస్తున్నారని తెలిసి తమ గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయన దాదాపు ప్రతి మండలంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ వస్తున్నారు. జగన్ వెంట నడిస్తే చాలన్నట్లు అనేక మంది యువకులు పాదయాత్రలో పాల్గొనడం విశేషం.
సమస్యలపై ముఖాముఖి....
ఇక జగన్ ప్రతి జిల్లాలో రైతులతో ముఖాముఖి జరుపుతున్నారు. చిత్తూరు జిల్లా నెమళ్లగుంటపల్లిలో జగన్ రైతులతో సమావేశమయ్యారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రైతులు తీవ్రంగా మోసపోయారన్నారు. బాబు పాలనలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లభించలేదని చెప్పారు. చంద్రబాబు, కరువు కవలపిల్లలని తీవ్రంగా విమర్శించారు. దేవుడి దయతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే రైతులకు మేలు చేసేలా పథకాలను ప్రవేశపెడతామన్నారు. రైతులు ఇచ్చిన సలహాలు తమ మ్యానిఫేస్టోలో చేరుస్తామని చెప్పారు. అందుకే ప్రతి జిల్లాలో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నానని జగన్ వివరించారు.
- Tags
- జగన్

