జగన్ వారికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు

వైసీపీ అధినేత జగన్ హామీల మీద హామీలు ఇస్తూ వెళుతున్నారు. అంతేకాదు నేతలకు, కులసంఘాలకు కూడా పదవులు హామీని స్పష్టంగా ప్రకటిస్తూ వెళుతున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనలో అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి భరత్ ను వైసీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు బీసీలకు ఎంపీసీటును కేటాయిస్తానని మాట ఇచ్చారు. తాజాగా గుంటూరు జిల్లాలో బీసీ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జగన్ వడ్డెర్లకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్పష్టమైన ప్రకటన చేయడం విశేషం.
బీసీల ఆత్మీయ సదస్సులో....
ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా ప్రతి జిల్లాలో వివిధ సామాజిక వర్గాల ఆత్మీయ సమ్మేళనాల్లో జగన్ పాల్గొంటున్నారు. మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలతో పాటు రైతు సదస్సులను కూడా పాదయాత్రలో ఒక భాగం చేశారు. ఆ జిల్లాలో ఉన్న సామాజిక వర్గం నేతలందరూ ఆ సమ్మేళనానికి హాజరవుతున్నారు. ఈనేపథ్యంలో ఈ సదస్సులను వైసీపీ ఎన్నికల ప్రచార సభలుగా ఉపయోగించుకుంటోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని గుడిపూడి కాలనీలో బీసీల ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొన్నారు.
నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు....
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వడ్డెర్లకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ ప్రకటించారు. వడ్డెర్ల వాణి చట్ట సభల్లో విన్పించాలన్నారు. వడ్డెర్ల వెల్ ఫేర్ ఫండ్ ను చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న బీమాకు మళ్లించిందన్నారు జగన్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వెల్ ఫేర్ ఫండ్ ను పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే అవినీతిలో కూరుకుపోయిన జన్మభూమి కమిటీలను కూడా రద్దు చేస్తామని చెప్పారు. అలాగే నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ప్రతి కులానికి ఏదో ఒక చోట సీటు కల్పించేలా చూస్తామని జగన్ చెప్పారు.
