జగన్ మూగనోము వదలరా?

ఏపీకి కేంద్ర బడ్జెట్ లో తీవ్ర అన్యాయం జరిగినా వైసీపీ అధినేత జగన్ ఎందుకు మాట్లాడరు? పార్టీ నేతలందరూ బడ్జెట్ పై తప్పుపడుతున్నా జగన్ నోటి నుంచి ఇంతవరకూ బడ్జెట్ పై అభిప్రాయం ఎందుకు వెలువడలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. జగన్ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన ప్రతి రోజూ ఒక బహిరంగసభలో ప్రసంగిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటి వరకూ బడ్జెట్ పై మాత్రం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ పార్టీ ఎంపీలు మాత్రం బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని నినదించారు. అవసరమనుకుంటే రాజీనామాలకు సిద్ధమని కూడా ప్రకటించారు. కాని జగన్ మాత్రం ఇప్పటి వరకూ బడ్జెట్ పై ఎలాంటి కామెంట్ చేయలేదు.
రాష్ట్రమంతటా నిరసనలు...
ఈరోజు రాష్ట్రమంతటా వైసీపీ శ్రేణులు బడ్జెట్ పై నిరసనలు తెలియజేశాయి. అంటే జగన్ సూచన మేరకే ఈ నిరసనలు తెలియజేశారన్నదిమ మాత్రం వాస్తవం. మరోవైపు టీడీపీ చంద్రబాబు బీజేపీ సర్కార్ చేసిన పనిని తూర్పారుపడుతూ లీకులు ఇస్తున్నారు. చంద్రబాబు పార్టీ నేతల అంతర్గత సమావేశాల్లో మాట్లాడినవి బయటకు తెలియడంతో అదే చంద్రబాబు అభిప్రాయంగా ప్రజలు పరిగణిస్తారు. చంద్రబాబు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీరియస్ గా ఉన్నారన్న సంకేతాలు ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైసీపీ అధినేత మాత్రం ఇంతవరకూ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.
హామీలు అమలు చేయకపోయినా....
ప్రత్యేక హోదా ఇస్తానంటే బీజేపీతో పొత్తుపెట్టుకుంటానని ఇటీవలే జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదా విషయాన్ని పక్కనపెట్టి...అసలు రాష్ట్రానికి రావాల్సిన నిధులే ఇవ్వకపోగా... విశాఖ రైల్వే జోన్ వంటి హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయదని తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో కూడా జగన్ ఎందుకు మూగనోము పట్టారని పార్టీ నేతల్లో విస్తృత చర్చ జరుగుతుంది. జగన్ కేసులకు భయపడే మోడీకి, ఆయన సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని ఇప్పటికే టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలను జగన్ నిజం చేస్తున్నట్లుంది.
పార్టీ నేతల్లోనే అసహనం....
రాష్ట్రానికి అన్యాయం జరిగిన బీజేపీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నమాట వాస్తవం. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలపై ఉన్న శ్రద్ధ విభజనతో పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పై మాత్రం చూపలేదన్నది సామాన్యుడికీ అర్థమైంది. ఈ పరిస్థితుల్లో జగన్ సైలెన్స్ పార్టీకి నష్టం తెప్పిస్తుందన్నది పార్టీ నేతల అభిప్రాయమే. కేంద్రంపై పడకుండా చంద్రబాబు పార్టీపై పడితే ఏం లాభమన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ తీసుకునే నిర్ణయమే పార్టీకి ఆయువు పోస్తుందంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. మరి జగన్ మూగనోము ఎప్పుడు వీడతారో....?
- Tags
- జగన్ మూగనోము

