జగన్ మీదకు ‘భూమాస్త్రం’ : హోదా చేతవుతుందా?

తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్న చాలా నెలల తరువాత.. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత భూమా నాగిరెడ్డిని , చంద్రబాబునాయుడు తన సంకల్పానికి అనుగుణంగా వాడుకోవడం ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశం లో చేరిన తర్వాత చంద్రబాబు అభివృద్ధికి సహకరించడమూ, తమ జిల్లా లోకల్ నాయకత్వాల మధ్య పొరపొచ్చాలు విభేదాలు లేవని చెప్పడమూ తప్ప.. మరో సందర్భంలో మీడియా ముందుకు రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన భూమా నాగిరెడ్డి తాజాగా మంగళవారం నాడు వైకాపా అధినేత , తనకు సమీప బంధువు అయిన జగన్మోహన రెడ్డి మీద ఒక రేంజిలో ధ్వజమెత్తారు.
జగన్ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం అంతా ఒక నాటకం అని భూమా అభివర్ణించారు. తాను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఎలా తీసుకురాగలడో జగన్ చెప్పాలని భూమా డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారని.. హోదా సాధించడం కోసం జగన్ ఎన్నడైనా ప్రధానిని కలిశారా.. నిర్దిష్టమైన ప్రయత్నం చేశారా అని భూమా ప్రశ్నించడం విశేషం.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కు తన సొంత అభివృద్ధి తప్ప, ప్రజల అభివృద్ధి మీద శ్రద్ధ ఉండదంటూ భూమా నాగిరెడ్డి విరుచుకుపడ్డారు. నంద్యాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా బాగా సహకరిస్తున్నారని కూడా భూమా నాగిరెడ్డి కితాబుఇచ్చారు. అయితే తనకు ఉన్న బంధుత్వం దృష్ట్యా నేరుగా జగన్ మీద విమర్శల జోలికి పెద్దగా వెళ్లని భూమా నాగిరెడ్డి, ఇవాళ మాత్రం జగన్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రత్యేకహోదా పోరాటాన్ని నాటకంగా కొట్టిపారేయడం గమనార్హం.

