జగన్ బాటలోనే పవన్ ...!

నాన్న ఆశయాలు నెరవేరుస్తా. ఆయన నాకిచ్చిన కోట్లాదిమంది కుటుంబ సభ్యుల్లో కొందరు నాన్న కోసం ప్రాణాలు విడిచి పెట్టారు. ఆ కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి ఓదారుస్తా అంటూ వైసిపి అధినేత జగన్ పార్టీ పెట్టకముందు పావురాల గుట్టలో చెప్పారు. అంతే అప్పటినుంచి ఆయన జైలు కు వెళ్లే వరకు ఓదార్పులమీద ఓదార్పులు చేస్తూ వైఎస్ ఆర్ విగ్రహాలు ఆవిష్కరిస్తూ తన పార్టీని రాష్ట్రం అంతా విస్తరించే ప్రణాళిక పక్కాగా చేశారు. ఆ ఓదార్పు కు అనూహ్య స్పందనే లభించింది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అదే సీన్ రిపీట్ చేయబోతున్నారు.
యువతకు భరోసా అంటూ ....
వివిధ సమస్యలపై తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ప్రాణాలు బలి తీసుకున్న యువతకు ధైర్యం చెప్పేందుకు తాను ప్రజల్లోకి వెళుతున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందుకోసం ఆయన పక్కాగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని పవన్ ఓదారుస్తారు. అక్కడ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు మద్దత్తు ఇస్తారు. కృష్ణా పడవ ప్రమాదం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపిస్తూ ,ఒంగోలు వెళ్ళి అక్కడి బాధితులను పవన్ కళ్యాణ్ ఓదార్చబోతున్నారు. ఇక హైదరాబాద్ ఉస్మానియాలో చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని కూడా కలవాలనుకున్నా పోలీస్ ఆంక్షల వల్ల వీలుకావడం లేదని అవి ఎత్తి వేసిన అనంతరం అక్కడికి వెళతా అంటున్నారు. ఈనెల 7 న రాజమండ్రి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని పనిలో పనిగా పవన్ పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. దాంతో ప్రాజెక్ట్ వ్యవహారం సైతం మరింత రాజకీయ రంగు పులుముకోనుంది.
యువతే టార్గెట్ గా ...
రాష్ట్రంలో యువతరం ఓటుబ్యాంక్ ను జనసేన వైపు మళ్లించేందుకు పవన్ స్కెచ్ వేశారు. అందుకే ప్రధానంగా విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగులు తదితర అంశాలపై తన ఫోకస్ పెట్టారు. ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యలు, వ్యవసాయ, వెటర్నరీ విద్యార్థుల సమస్యలపై పోరాటానికి సంకల్పించారు. ఫిబ్రవరి లో పొలిటికల్ గా విడుదల అవుతారన్న పవన్ రెండు నెలల ముందే ఏపీ రాజకీయ తెరపైకి దూకేయడం హాట్ టాపిక్ గా మారింది.
- Tags
- పవన్

