జగన్ పై చేయి సాధించినట్లేనా?

ప్రత్యేకహోదా నినాదాన్ని భుజానకెత్తుకున్న జగన్ పట్ల ఏపీ ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. వైసీపీ ఒక్కటే తొలి నుంచి ప్రత్యేక హోదా నినాదాన్ని విన్పిస్తుంది. యువభేరి పేరిట దాదాపు జగన్ అన్ని జిల్లాల్లో సభలను నిర్వహించారు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహారదీక్ష కూడాచేశారు. ఆమరణదీక్ష చేసిన ఫొటోలతో సహా వైసీపీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, నిన్న జరిగిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలోనూ వాడుకుని ప్రచారం చేసుకుంటుంది. వైసీపీ పట్ల విశ్వసనీయత ప్రజల్లో పెరిగిందంటున్నారు. బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలను అడ్డంగా మోసం చేశాయన్న అపవాదును కూడా ఎదుర్కొంటున్నాయి.
బాబు తప్పులో కాలేశారా?
ముఖ్యంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో తప్పులో కాలేశారు. తొలినుంచి ప్రత్యేక హోదాను చంద్రబాబు వ్యతిరేకించారనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఏద చెబితే అది వినేసి ప్యాకేజీ కోసం పాకులాడటం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందన్నది అందరికీ తెలిసిందే. ’’ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? హోదా కంటే ప్యాకేజీ వల్లనే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది’’ అన్ని చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెటిజెన్లు కూడా టీడీపీ, చంద్రబాబు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజీనామా అస్త్రాలతో....
దీంతో పాటుగా బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి ఏదీ కేటాయించలేదని తెలియగానే తొలుత జగన్ రాజీనామాల అస్త్రాన్ని సంధించారు. ఇది కూడా ఒకరకంగా రేసులో ముందున్నట్లే. ఎందుకంటే చంద్రబాబు పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళలను చేసినా ఫలితం ఉండదని అందరికీ తెలిసిందే. ఆందోళనల వల్ల సాధ్యమవుతుందనుకుంటే చంద్రబాబు ఎప్పుడో ఆ పనిచేసేవారని, కేంద్రం నుంచి సానుకూలత లేకపోవడం వల్లనే ఎంపీల చేత ఆందోళన డ్రామాలను ఆడించారని వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది.
కొన్ని సంచలన నిర్ణయాలుంటాయి....
ఈనేపథ్యంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఇక వదిలిపెట్టకుండా ముందుకు తీసుకెళ్లాలని జగన్ నిర్ణయించారు. ఇకపై రోజూ ఏదో ఒక ఆందోళ నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ నేతలు చేయాలని కోరారు. ధర్నాల రూపంలోగాని, నిరసనల ద్వారా గాని ఉద్యమ వేడి చల్లారకుండా ఏదో ఒక కార్యక్రమంతో పార్టీని ప్రజల్లో ఉంచాలని జగన్ నేతలకు ఆదేశించినట్లు తెలిసింది. ఏపార్టీ ఆందోళనకు పిలుపునిచ్చినా వైసీపీ పాల్గొనాలని కూడా జగన్ చెప్పారు. ముఖ్యంగా వామపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన కార్యక్రమాలకు మద్దతు తెలపాలని జగన్ నిర్ణయించారు. మొత్తం మీద ప్రత్యేక హోదా అంశం జగన్ కు కలిసివచ్చినట్లే కన్పిస్తోంది. రాబోయే రోజుల్లో జగన్ కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటారని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. మరి అవి ఏంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
- Tags
- జగన్

