జగన్ పాదయాత్రపై మోడీ ఆరా...!

వైసీపీ అధినేత జగన్ పాదాయత్ర జనం పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర ఇంటిజెన్స్ బ్యూరో ఆరాతీస్తున్నట్లు సమాచారం. పాదయాత్ర ప్రతిరోజూ అపడేట్స్ ను ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కార్యాలయానికి నివేదికలు అందిస్తున్నారు. జగన్ ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పది రోజుల పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ బ్యూరో సేకరిస్తుంది. పాదయాత్రకు స్వచ్ఛందంగా జనం తరలివస్తున్నారా? పార్టీ నేతలు తరలిస్తున్నారా? అన్న విషయంపై వారు ఆరా తీసి సమగ్ర నివేదికను ప్రధాని కార్యాలయానికి పంపుతున్నారు.
ఢిల్లీ స్థాయిలో చర్చ...
ఢిల్లీ స్థాయిలోనూ జగన్ పాదయాత్రపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయం మీడియా ఇన్ ఛార్జి సంజయ్ మాక్ ఈ విషయాన్ని ధృవీకరించారు. జగన్ పాదయాత్ర పై తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ పాదయాత్రపై ఆరా తీస్తోంది. పాదయాత్రపై వస్తున్న స్పందనను చూసి వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అన్న విషయంపై బీజేపీ ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే పది రోజుల పాదయాత్రకు విశేష స్పందన లభించడంతో వైసీపీ అధినేత జగన్ కు లభిస్తున్న ఆదరణను బీజేపీ లెక్క గట్టే పనిలో పడింది. అలాగే జగన్ ప్రసంగాలు... ఏ ఏ అంశాలపై మాట్లాడుతున్నారన్న విషయంపై కూడా సమాచారాన్ని ప్రధాని కార్యాలయం సేకరిస్తోంది. జగన్ పాదయాత్రపై కేవలం బీజేపీయే కాకుండా కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీల్లో కూడా చర్చ జరుగుతోంది.
- Tags
- జగన్ పాదయాత్ర

