జగన్ పాదయాత్రకు విరామం

వైసీపీ అధినేత జగన్ 11వ రోజు పాదయాత్రకు బ్రేక్ పడనుంది. ఆయన ఈరోజు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అందుకోసం జగన్ 11వ రోజు పాదయాత్రకు ఒకరోజు విరామం ప్రకటించారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఆయన పాదయాత్రలో ఉన్నానని, తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని వేసుకున్న పిటీషన్ ను కోర్టు గతంలోనే కొట్టివేసిన సంగతి తెలిసిందే. గత వారం కూడా జగన్ కోర్టుకు హాజరయ్యారు. పాదయాత్ర ఆపిన చోటు నుంచి మళ్లీ శనివారం ఉదయం జగన్ యాత్రను ప్రారంభిస్తారు.
నేడు కోర్టుకు హాజరు...
ప్రస్తుతం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జగన్ 250 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈ జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలను జగన్ టచ్ చేయనున్నారు. ఆళ్లగడ్డ నుంచి గురువారం బయలుదేరిన జగన్ పెద్దచింతకుంట, భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్ రోడ్స్, కొండాపురం, దోర్నిపాడు ల్లో యాత్ర జరిగింది. రాత్రికి యాత్ర ముగిసిన వెంటనే జగన్ రోడ్డు మార్గాన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. కోర్టు విచారణ పూర్తయిన అనంతరం జగన్ సాయంత్రం తిరిగి కర్నూలు జిల్లాకు బయలుదేరి వెళతారు.
- Tags
- జగన్ పాదయాత్ర

