జగన్ పాదయాత్రకు ముందే వేడి పుట్టిస్తున్నారా?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు ముందే బాగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ప్రజల్లో బలీయంగా ఉన్న ప్రత్యేక హోదాను ప్రజల్లో ఉవ్వెత్తున మళ్లీ రగిలించాలన్నది జగన్ ప్రయత్నంగా కన్పిస్తోంది. వైసీపీ అధినేత జగన్ నవంబర్ 2వ తేదీ నుంచి ఆరు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేయనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఈ పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. అయితే జగన్ పాదయాత్ర ప్రారంభానికి ముందే ప్రతి నియోజకవర్గంలో యువభేరిలు నిర్వహించాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ఆ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు ఈ యువభేరిలను ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాలని చెప్పారు. తన పాదయాత్ర ఆ నియోజకవర్గాల్లోకి ప్రవేశించేలోగా ప్రత్యేకహోదా అంశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నారు. అందుకోసమే నేడు జగన్ అన్ని నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు, ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
పవన్ కు క్రెడిట్ దక్కకుండా.....
జగన్ ప్రత్యేక హోదా చాలా రోజుల తర్వాత తిరిగి గళమెత్తుతున్నారు. అయితే అందుకు జగన్ కూడా వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో యువభేరిలను నిర్వహించామని, తర్వాత పరీక్షలు, కళాశాలలకు సెలవులు రావడంతోనే యువభేరిలు జరపలేకపోయామన్నారు. అంతేకాకుండా హోదాపై ఆఖరి అస్త్రంగా ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని కూడా ప్రకటించడం విశేషం. అయితే దీనివెనక పవన్ ప్రభావం ఉందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా కొద్దిరోజుల్లో రధయాత్ర చేపట్టనున్నారు. పవన్ ప్రధానంగా ప్రత్యేక హోదా నినాదంతోనే ముందుకు వెళతారు. పవన్ కంటే ముందుగానే బరిలోకి తానే ప్రత్యేకహోదాకు పాటుపడుతున్నానన్న సంకేతాలు ఇవ్వాలన్నది జగన్ ఉద్దేశంగా కన్పిస్తోంది. పవన్, తనదీ ఒకే డిమాండ్ అయినప్పుడు ప్రజలు ముందునుంచి కష్టపడుతున్న తనవైపే మొగ్గుచూపుతారని విశ్వసిస్తున్నారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర కంటే ముందుగానే క్షేత్రస్థాయిలో వేడిపుట్టించాలని నిర్ణయించారు.
- Tags
- జగన్

