జగన్ పాదయాత్ర వెనక ఎవరంటే?

వైఎస్ జగన్ పాదయాత్రకు వెనక కేవీపీ సలహాలు, సూచనలు అందిస్తున్నారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాదయాత్రకు రూట్ మ్యాప్, ప్రణాళికలను సిద్ధం చేసినా... కేవీపీ సలహాలను యాత్రలో కొన్నింటిని చొప్పిస్తున్నట్లు సమాచారం. కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి కేవీపీ రాకపోయినా... యువకుడైన జగన్ కు కొంత అండదండలుగా కేవీపీ ఉంటున్నారన్నదానిలో సందేహం లేదు. సీనియర్ నేతలను పార్టీలోకి తీసుకు రావడంలో కూడా కేవీపీ దౌత్యం ఉందన్నది నగ్నసత్యం. నంద్యాల ఉపఎన్నికకు ముందు శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి రావడానికి కేవీపీ జోక్యమే ప్రధాన కారణమన్నది వైసీపీలో ప్రతి ఒక్కరికీ తెలుసు.
కేవీపీ సలహాలే కీలకమా?
ఇక వైఎస్ గతంలో పాదయాత్ర చేసినప్పుడు కేవీపీ రామచంద్రరావు అన్నీ దగ్గరుండి చూశారు. రూట్ మ్యాప్ దగ్గర నుంచి అన్నీ తానే డిసైడ్ చేశారు. పాదయాత్రలో వైఎస్ ను దగ్గరుండి చూసిన కేవీపీ తన అనుభవాలను జగన్ కు వివరించినట్లు తెలుస్తోంది. పాదయాత్రకు ప్రతి శుక్రవారం బ్రేక్ పడినా ప్రజల్లో ఎటువంటి సంకేతాలు వెళ్లవని కేవీపీ జగన్ కు ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేవీపీతో వైసీపీ అధినేత జగన్ టచ్ లోనే ఉన్నారు. ఆయన సలహాల మేరకు నడుచుకుంటున్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను కేవీపీ వివరించారట. ఈ మేరకు జగన్ పాదయాత్రలో వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న కొందరు సీనియర్ నేతలతోనూ కేవీపీ మాట్లాడారని తెలుస్తోంది. మొత్తం మీద కేవీపీ కాంగ్రెస్ లో ఉన్న ఆయన మనసు మాత్రం వైసీపీ చుట్టూనే తిరుగుతుందన్నది వాస్తవం. జగన్ కూడా ఆయనిచ్చే సలహాలు పాటించేందుకు రెడీ అయ్యారట. అంటే జగన్ పాదయాత్రను వెనకుండి నడిపిస్తున్నది కేవీపీనేనన్నది దీన్ని బట్టి తెలుస్తోంది. పార్టీలోనూ దీనిపై పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.
- Tags
- జగన్ పాదయాత్ర

