జగన్ ను పలకరించకుండా ఎలా వెళ్తాం?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు చిత్తూరు జిల్లాలో జనం పోటెత్తుతున్నారు. జగన్ పై నమ్మకం ఉండబట్టే జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత పదిరోజుల నుంచి జగన్ చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. ఆయన పర్యటించిన ప్రతి నియోజకవర్గంలోనూ మంచి స్పందన కన్పించడంతో వైసీపీ నేతల్లో ఉత్సాహం రెట్టింపయింది. యాత్ర ప్రభుత్వంపై ఒక ఉద్యమంలా కొనసాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. ఈ యాత్ర తమ గ్రామానికి చేరుకుంటుందని ముందుగానే తెలుసుకున్న ప్రజలు పనులు మానుకుని మరీ జగన్ ను చూసేందుకు తరలి వస్తున్నారు. జగన్ అంతదూరం నుంచి నడిచి వస్తుంటే ఆయనను పలుకరించకుండా తాము పనులకు ఎందుకు వెళతామని ప్రశ్నిస్తున్నారు.
పాదయాత్రకు పోటెత్తుతున్న జనం....
మరోవైపు జగన్ పాదయాత్రలో వినతులు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకూ తమ సమస్యలను జగన్ ముందుంచుతున్నారు. అధికారంలో లేకపోయినా....జగన్ వాటిని ప్రస్తుతం పరిష్కరించలేరని తెలిసినా సమస్యలను వివరించేందుకు ముందుకు వస్తుండటం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దంపడుతుందంటున్నారు. అందరికీ భరోసా కల్పిస్తూ జగన్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా స్థానికులు తమ సమస్య చెప్పగానే జగన్ శ్రద్థగా వింటమే కాకుండా వాటిని నోట్ చేసుకోమని వ్యక్తిగత సిబ్బందికి చెప్పడం కూడా బాధితులు భరోసానిస్తుంది. ఏర్పేడు మండల కేంద్రమయితే జనసంద్రంగా మారింది. తొక్కిసలాట జరగడంతో జగన్ భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే జగన్ పాదయాత్రలో సేవా కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు. ఏర్పేడు మండలంలో జగన్ వైసీపీ నేత మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన నేత్రశిబిరాన్ని ప్రారంభించారు.
నేడు 900 కిలోమీటర్ల మైలురాయిని....
జనం విపరీతంగా తరలి వస్తుండటంతో పాదయాత్ర నెమ్మదిగా సాగుతోంది. శనివారం జగన్ కేవలం 12. 8 కిలోమీటర్లు మాత్రమే నడిచారు. ఇప్పటి వరకూ జగన్ 896.4 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. 67వ రోజు ప్రజాసంకల్పయాత్ర ఈరోజు ప్రారంభం కానుంది. ఈరోజు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే పాదయాత్ర కొనసాగనుంది. రచ్చగున్నేరు, ఇసుకగుంట, కాపు గున్నేరు క్రాస్ రోడ్స్, తాండమాన్ పురం క్రాస్ రోడ్స్, చెర్లోపల్లి, మిట్ట కండ్రిగ, టీఎంవీ కండ్రిగ క్రాస్ రోడ్స్, పానగల్ వరకూ జరుగుతుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం శ్రీకాళహస్తి పట్టణానికి జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈరోజు జగన్ 900 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనున్నారు.
- Tags
- జగన్

