జగన్ ను దెబ్బకొట్టేందుకు టీడీపీ కొత్త ఎత్తు...!

తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ ప్రారంభించిందా? అవును... త్వరలోనే పార్టీలో చేరికలున్నట్లు సీనియర్ మంత్రులు చెబుతున్నారు. అయితే జగన్ పాదయాత్ర సందర్భంగానే ఈ చేరికలు ఉండాలని చంద్రబాబు ఆదేశించడంతో ఇప్పుడు ఆగినట్లు సమాచారం. నవంబర్ 6వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. జగన్ పాదయాత్ర చేసే సమయంలో పెద్దయెత్తున చేరికలు ఉండేలా చూడాలని జిల్లా నేతలను చంద్రబాబు ఆదేశించారు. జగన్ పాదయాత్ర ఆ జిల్లాలోకి అడుగుపెట్టినప్పుడే ఈ చేరికలు ఉండేలా టీడీపీ అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నారు.
పాదయాత్ర సమయంలోనే చేరికలు....
ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నేతలకు చంద్రబాబు ముఖ్యంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు టీడీపీతో టచ్ లో ఉన్నారని తెలిసింది. వీరిలో వైసీపీకి చెందిన వారు కొందరు కాగా, మరికొందరు కాంగ్రెస్ కు చెందిన వారు కూడా ఉన్నారని చెబుతున్నారు. జగన్ పాదయాత్ర జరిగేటప్పుడే చేరికలు ఉంటే మానసికంగా దెబ్బతీసినట్లవుతుందని టీడీపీ ప్లాన్ గా కన్పిస్తోంది. ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకకు వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చే బాధ్యతను అప్పజెప్పారట. అలాగే అనంతపురంలో ఇప్పటికే వైసీపీ పై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డిని కూడా పాదయాత్ర సమయంలోనే పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే ప్రకాశం జిల్లాలోనూ చేరికలు అదే సమయంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద జగన్ పాదయాత్రను లోపాయికారిగా దెబ్బతీసేందుకు టీడీపీ చేస్తున్న వ్యూహాలను ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి మరి.
- Tags
- జగన్ చంద్రబాబు

