జగన్ కు క్లీన్ చిట్ లభించేనా?

వైసీపీలో ఆ రెండు కేసులపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ ప్రతి శుక్రవారం న్యాయస్థానానికి హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ సీబీఐ కోర్టుకు నేడు కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఇటీవల తీర్పులు వచ్చిన 2జీ స్పెక్ట్రమ్, పశుదాణా కుంభకోణం కేసుపైనే కోర్టు ఆవరణలో వైసీపీ నేతలు చర్చించుకున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేసును కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీఎంకే నేతలు రాజా, కనిమొళి నిర్దోషులుగా బయటపడ్డారు. జగన్ కూడా అలాగే కేసుల నుంచి బయటపడతారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే జగన్ పై సీబీఐ పెట్టిన ఛార్జిషీట్లలో కొన్నింటిని కోర్టు కొట్టివేసింది. మరికొన్నింటిపై విచారణ జరుపుతోంది.
రెండు కేసులూ...వేరు...వేరు...
ఇక పశుదాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను కోర్టుదోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఇది కూడా సీబీఐ కోర్టే. అయితే ఆకేసుకు.. జగన్ కేసులకు చాలా తేడా ఉందంటున్నారు. జగన్ పై పెట్టిన ఏ కేసులోనూ ఆయనకు ప్రత్యక్ష పాత్ర లేదంటున్నారు. జగన్ పై కేసులన్నీ దాదాపుగా నీరుగారిపోతాయని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారని ఒక వైసీపీ నేత కోర్టు ప్రాంగణంలో వ్యాఖ్యానించారు. మంత్రివర్గం తీసుకున్ననిర్ణయాలన్నింటినీ జగన్ పైకి నెట్టిశారంటున్నారు. అయితే కేసులు ఎంతకాలం నడుస్తాయన్నది తేలకపోవడంతో ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సి వస్తుందని ఆయన చెప్పారు.
రాజకీయంగా మాత్రం ఇబ్బందేనా?
రాజకీయంగా మాత్రం ఈ కేసులు జగన్ ను ఇబ్బందిపెడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఈ కేసులు ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. కేసుల్లో కూరుకుపోయిన జగన్ అధికారంలోకి వస్తే అరాచకమేనన్న ప్రచారాన్ని టీడీపీ ఉధృతం చేస్తోంది. అయితే ఎన్నికల సమయానికి జగన్ క్లీన్ చిట్ వస్తుందని, అన్ని కేసుల నుంచి బయటపడతారని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే కొందరి నేతల్లో మాత్రం టెన్షన్ కన్పిస్తోంది.
- Tags
- జగన్

