జగన్ కు ఆక్సిజన్ అదేనా?

వైసీపీ అధినేత జగన్ కు ఆక్సిజన్ లా పనిచేస్తుంది పాదయాత్ర. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లినా, నంద్యాల ఎన్నికల్లో ఓటమి చవి చూసినా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదు. ఎందుకంటే ప్రజలు తన వెంట ఉన్నారన్న నమ్మకం కావచ్చు. అందుకే పీపుల్స్ పల్స్ తెలుసుకునేందుకు ఆయన జనం బాట పట్టారు. అయితే జగన్ పాదయాత్రకు ఇప్పటి వరకూ పూర్తయిన నాలుగు జిల్లాల్లో మంచి స్పందనే లభించింది. సభలకు, సదస్సులకు వైసీపీ నేతలే జన సమీకరణ చేశామందామనుకున్నా... పాదయాత్రకు వేలాది మంది తరలి వస్తుండటంతో జగన్ సయితం ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ నేతల జనసమీకరణ చేస్తున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే జనసమీకరణ చేస్తే వారు కేవలం కొద్ది సమయం మాత్రమే జగన్ వద్ద ఉంటారు. కాని స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు జగన్ వెంటే నడుస్తున్నారు.
నడక నెమ్మదించింది.....
ఒక గ్రామంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశిస్తే ఆ గ్రామంలోని ప్రజలు అత్యధిక శాతం యాత్ర గ్రామం దాటి వెళ్లేంతవరకూ జగన్ వెంటే నడుస్తున్నారు. వేరే గ్రామంలోకి ప్రవేశించగానే అక్కడ స్వాగతంతో జనం జగన్ ను ఉక్కిరబిక్కిరి చేస్తున్నారు. అందుకే ఆయన ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవ లేకపోతున్నారు. మామూలుగా రోజుకు పదిహేను కిలోమీటర్లు నడవాలన్న లక్ష్యంతో జగన్ పాదయాత్రను ప్రారంభిచారు. కాని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రోజుకు 12 కిలోమీటర్లకు మించి నడవలేక పోతున్నారు.
నమ్మకం పెరిగిందా?
అందుకే జగన్ లో నమ్మకం పెరిగిందంటున్నారు వైసీపీ నేతలు. స్వచ్ఛందంగా తరలి వస్తూ తమ సమస్యలను వివరిస్తున్న ప్రజల పట్ల జగన్ మోహన్ రెడ్డి సహనంగా వ్యవహరిస్తున్నారు. నేతల విషయాన్ని పక్కన బెడితే ప్రజలు ఎవరువచ్చినా ఓవర్ యాక్షన్ చేయవద్దని తన సెక్యూరిటీ సిబ్బందికి జగన్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, ఉద్యోగ సంఘాలు కూడా జగన్ వద్దకు వచ్చి తమ సమస్యల గురించి ఏకరవు పెడుతున్నారు. అన్ని శ్రద్థగా వింటున్న జగన్ వాటిని నోట్ చేసుకుంటున్నారు. మొత్తం మీద పాదయాత్రలో వస్తున్న రెస్పాన్స్ జగన్ కు ఆక్సిజన్ లా పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పొచ్చు.
- Tags
- జగన్

