జగన్ కు అనుకూలమా? వ్యతిరేకమా?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నిరాటంకంగా సాగుతుందా? లేక బ్రేకులు తప్పవా? ఈ విషయం నేడు తేలనుంది. సీబీఐ కోర్టు జగన్ పాదయాత్ర విషయంలో కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందా? లేదా? అన్నది మరికొద్దిసేపట్లో తెలిసిపోతుంది. నవంబర్ 2వ తేదీ నుంచి జగన్ ఏపీలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం ఆరు నెలలపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్ర కోసం జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాల్లో వైసీపీ శ్రేణులు కూడా జగన్ రాక కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి.
తీర్పు ఎలా వచ్చినా.....
అయితే వైసీపీ అధినేత జగన్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు సీబీఐ కోర్టుల్లో నడుస్తున్నాయి. ఇందుకోసం జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే తాను ఏపీలో పాదయాత్ర చేస్తున్నానని, మారుమూల ప్రాంతంలో ఉంటానని, ఆరు నెలల పాటు తనను కోర్టు హాజరు నుంచి మినహాయించాలని జగన్ సీబీఐ కోర్టును కోరారు. దీనిపై సీబీఐ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం కూడా వారానికి ఒకరోజు కోర్టుకు వస్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో వెలువడే తీర్పు జగన్ పాదయాత్రకు బ్రేకులు పడతాయా? లేదా? అన్నది తేల్చనుంది. న్యాయస్థానం వ్యక్తిగత హాజరు నుంచి జగన్ ను మినహాయించకుంటే... ప్రతి శుక్రవారం పాదయాత్రను ఆపి... జగన్ హైదరాబాద్ కు రావాల్సి ఉంటుంది. అయితే వైసీపీ నేతలు కూడా తీర్పు ఎలా వచ్చినా... అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
- Tags
- జగన్

