జగన్ ఇంత లేటవుతున్నారెందుకు?

నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడ చూసినా జనమే. ఆయన వెంట నడిచేందుకు పోటీ పడుతుండటంతో జగన్ నడక కూడా నెమ్మదించింది. ప్రస్తుతం జగన్ నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. సూళ్లూరుపేట ఓజిలి మండలం చిలమాను చేను క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర నిన్న మధ్యాహ్నం గూడూరు నియోజకవర్గానికి చేరుంకుంది. జగన్ కు ప్రతిచోటా తమ సమస్యలను గురించి వినతి పత్రాలను అందిస్తున్నారు. వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామ సమస్యలను కూడా జగన్ దృష్టికి తెస్తున్నారు. అన్నింటినీ ఓర్పుగా వింటున్న జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.
పెద్దయెత్తున వస్తున్న మహిళలు....
ముఖ్యంగా జగన్ ను చూసేందుకు పెద్దయెత్తున మహిళలు తరలి వస్తుండటం విశేషం. చిన్నాపెద్దా తేడా లేకుండా జగన్ ను చూసేందుకు బారులు తీరుతున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా తలనిమిరి మరీ జగన్ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. మధ్యలో వైఎస్ విగ్రహాలను గ్రామస్థులే స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నారు. జగన్ వాటిని ఆవిష్కరిస్తున్నారు. గుర్రంకొండలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అలాగే ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఏర్పాటు చేస్తుండటంతో దానిని ఆవిష్కరిస్తున్నారు. దీంతో జగన్ పాదయాత్ర ఉదయమే ప్రారంభమైన షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగడం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. గుర్రంకొండ, ఆర్మనుపాడు, కాండ్ర, వెంకటేశుపల్లిలో మహిళలు ఎక్కువగా వచ్చి జగన్ ను పలకరించారు. కొందరు హారతులతో స్వాగతం పలికారు.
980 కిలోమీటర్లు నడిచి....
వైసీపీ నేత జగన్ పాదయాత్ర 73వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఆయన ఉదయం కొండగుంట నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి పాలిచర్ల, గాంధీనగర్ చేరుకుంటారు. అక్కడ భోజన విరామానికి ఆగుతారు. తర్వాత ఇందిరమ్మ కాలనీ మీదుగా గూడూరు కోర్టు సెంటర్ కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. జగన్ నిన్న మొత్తం 14.7 కిలోమీటర్ల మేరకు నడక సాగించారు. వాస్తవానికి మరిన్ని కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉన్నా జనం రాకతో ఆయన ఎక్కువసేపు పలకరింపులు, వినతిపత్రాలను స్వీకరించడంతోనే సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ 980.5 కిలోమీటర్లను నడిచారు.
- Tags
- జగన్

