జగన్ ఆ పేరు పోగొట్టుకునేందుకు....!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బీజేపీపై యుద్ధం ప్రకటించినట్లేనా? కేసులకు తాను భయపడుతున్నాడన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇక బీజేపీపై విరుచుకుపడాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారా? అవుననే అనిపిస్తోంది. గత రెండు రోజుల నుంచి వైసీపీ నేతలు బీజేపీ పై విరుచుకు పడుతున్నారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందని బహిరంగంగా విమర్శిస్తున్నారు. గతంలో ఇలాబీజేపీని నేరుగా వైసీపీ విమర్శించిన దాఖలాలు లేవు. అయితే తాజా రాజకీయ పరిణామాలతో జగన్ కొంత అప్రమత్తమయ్యారు. టీడీపీ, బీజేపీలు కలిసి డ్రామాలాడుతున్నాయని ఆయన భావించే టీడీపీతో సమానంగా బీజేపీపైన కూడా మాటల దాడిని ప్రారంభించాలని సీనియర్ నేతలకు చెప్పినట్లుంది.
బీజేపీపై స్వరం పెంచి.....
అందుకే ధర్మాన ప్రసాదరావు, విజయసాయి రెడ్డిలు కూడా బీజేపీ, టీడీపీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయని విమర్శించారు. తాము మొదటి నుంచి బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చెబుతూనే వస్తున్నామని, కాని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ చెప్పిన ప్యాకేజీకి తలూపి ఇప్పుడు అన్యాయమంటూ గగ్గోలు పెడుతుందన్నారు. వాస్తవానికి గత నాలుగేళ్ల నుంచి వైసీపీ నేతలు బీజేపీపైన గాని, ప్రధాని మోడీపైన గాని ఎటువంటి విమర్శలు చేయలేదు. అయితే తాజాగా వైసీపీ బీజేపీపై విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
ప్రత్యేక హోదాతోనే....
అసలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకోవడమే తమ స్టాండ్ ను తెలియజేస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినా అనేకసార్లు ఆందోళనలు చేశామని, జగన్ నిరాహార దీక్షలు కూడా చేశారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా నినాదంతోనే తాము ఎన్నికలకు వెళతామని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా హోదా సాధిస్తామని చెబుతున్నారు. జగన్ కేసుల గురించి భయపడే బీజేపీపై విమర్శలు చేయలేదనడం అవాస్తవమంటున్నారు. ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన టీడీపీ తమ తొలి టార్గెట్ అని, బీజేపీని కూడా వదిలే ప్రసక్తి లేదంటున్నారు వైసీపీ నేతలు.
91వరోజు పాదయాత్ర ఇలా....
కాగా జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. 91వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర ఈరోజు ఉదయం 8గంటలకు నూకవరం నుంచి ప్రారంభంకానుంది. తర్వాత అత్తింటి వారి పాలెం, బడే వారి పాలెం చేరుకుంటుంది. బడేవారి పాలెంలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తర్వాత బొంతవారి పాలెం, కాకుటూరు, చెర్లోపాలెం, ప్రశాంతనగర్ ల మీదుగా సాగుతుంది. ప్రశాంత్ నగర్ లో జగన్ మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి కందుకూరు పట్టణానికి చేరుకుంటారు. కందుకూరులోనే ఆదివారం రాత్రి జగన్ బస చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్రలో 12 నియోజకవర్గాలకు చెందిన ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
- Tags
- జగన్

