జగన్ అక్కడకు ఎందుకు వెళ్లడం లేదు?

జగన్ పదహారో రోజు యాత్ర ముగిసింది. ఈరోజు జగన్ యాత్రకు విరామం ప్రకటించనున్నారు. సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో ప్రతి శుక్రవారం జగన్ పాదయాత్రకు బ్రేక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత జగన్ మూడోసారి విరామం ప్రకటించారు. నవంబర్ 6వ తేదీన ప్రారంభమైన యాత్ర ఇప్పటికి 240 కిలోమీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం జగన్ కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి లో పాదయాత్రను ముగించారు. అక్కడి నుంచి రాత్రి హైదరాబాద్ బయలు దేరి వచ్చేశారు. శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరయిన తర్వాత ఆయన తిరిగి వెల్దుర్తి శుక్రవారం రాత్రికి చేరుకుంటారు. శనివారం నుంచి యధాతధంగా పాదయాత్ర ప్రారంభమవుతోంది.
నేడు పాదయాత్రకు విరామం....
అయితే జగన్ మూడు శుక్రవారాలు పాదయాత్రకు విరామమిచ్చి హైదరాబాద్ వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సీబీఐ కోర్టులోనే జగన్ గడిపారు. కాని పాదయాత్ర నుంచి కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన జగన్ ఇప్పటి వరకూ తన సొంత ఇంటికి వెళ్లలేదు. లోటస్ పాండ్ కు వెళ్లకుండా తన సన్నిహితుల ఇంట్లోనే కొద్దిసేపు బస చేస్తున్నారు. లోటస్ పాండ్ కు వెళితే తప్పుడు సంకేతాలు వెళతాయని, పాదయాత్ర ముగించుకుని ఇంటికి వచ్చారన్న ఆరోపణలు వస్తాయని భావించిన జగన్ గతంలో రెండు సార్లూ లోటస్ పాండ్ కు వెళ్లకుండానే సన్నిహితుడి ఇంట్లో ఫ్రెష్ అయ్యారు. అలాగే కోర్టు నుంచి తిరిగి పాదయాత్రకు వెళ్లేముందు కూడా అక్కడే కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర ముగించిన తర్వాతనే లోటస్ పాండ్ కు వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లుంది.
- Tags
- జగన్

