చౌదరి లాబీయింగ్ ఫలిస్తుందా?

చిక్కుముడులు పడుతున్న పోలవరం ప్రాజెక్ట్ బాధ్యతలు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి సుజనా చౌదరికి అప్పగించారు. ఢిల్లీ లో లాబీయింగ్ చేయకపోతే ప్రాజెక్ట్ పనులు మందగిస్తాయని గ్రహించిన బాబు పోలవరం ఫాలో అప్ ఎవరో ఒకరిపై పెట్టాలని భావించినట్లు సమాచారం. దాంతో సుజనా చౌదరి రాజమండ్రి కి చెందిన బిజెపి ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ను వెంటబెట్టుకుని కేంద్ర జలవనరుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ ని కలిశారు. పోలవరం పనులు వ్యవహారం, నిధుల విడుదలలో ఇబ్బందులు,తెలియచేసి ప్రాజెక్ట్ సీఈ గా సంయుక్త కార్యదర్శి హోదాలో ఉండేవారిని నియమించాలంటూ గడ్కరీ ని వేడుకుంది బృందం.
గడ్కరీ సానుకూలంగా స్పందించారన్న చౌదరి ...
రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ లో పడుతున్న ఇబ్బందులు వారం లోగా తొలగిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రకటించారు. నితిన్ గడ్కరీ తో సమావేశం ముగిశాకా మీడియా తో పలు అంశాలు చౌదరి మాట్లాడినా కొన్ని కీలక అంశాలపై సమాధానాలు దాట వేశారు. నాబార్డ్ నుంచి వేగవంతంగా నిధులను విడుదల అయ్యేలా కార్యాచరణ, సీఈ నియామకంపై రెండురోజుల్లో నిర్ణయం, నిధుల విడుదల పాత బకాయిలపై కమిటీ సమావేశం ఏర్పాటు చేసి వారంలోగా పరిష్కారం చూపిస్తా అని నితిన్ భరోసా ఇచ్చారని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ రాగానే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు ఆయన.
మంత్రులు , ఎంపీలు విస్మరించిన బాధ్యతలు ...
పోలవరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం కిందా మీదా పడుతుంటే ఢిల్లీ లో ప్రభుత్వంలో వున్న మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు, ఎంపీలు తమకు పట్టనట్లు వ్యవహరించడం ఏమిటన్న ప్రశ్న టిడిపి లోను, ప్రజల్లోనూ బయల్దేరింది. దాంతో అధిష్టానం ఆదేశాలను స్వీకరించి సుజనా చౌదరి ఈ అంశంపై ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నితిన్ గడ్కరీ ని కలవడం ఆయన నుంచి కొన్ని హామీలు లభించాయి అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
- Tags
- సుజనా చౌదరి

