చెంప చెళ్లుమనిపిస్తే కోటిరూపాయలు...!

బీహార్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ వీడియోలు, ఫొటోలతో ఆర్జేడీ, జేడీయూ మధ్య వార్ నడిచిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక యువతితో దిగిన ఫొటోలను బయటపెట్టి ఆయన పై విమర్శలకు దిగారు. అయితే తాజాగా లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ చెంప చెళ్లుమనిపిస్తే తాను కోటి రూపాయలు నజరానా ఇస్తానని బీజేపీ నాయకుడు ఒకరు ప్రకటించారు. ఇది బీహార్ లో సంచలనం రేకెత్తిస్తోంది. తేజ్ ప్రతాప్ చెంప చెళ్లుమనిపించిన వారికెవరికైనా తాను కోటి రూపాయలు ఇస్తానని పాట్నా బీజేపీ మీడియా ఇన్ ఛార్జి సాహ్ని ప్రకటించారు.
తమకు సంబంధం లేదంటున్న బీజేపీ.....
ఇటీవల బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీపై తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సుశీల్ కుమార్ మోడీ అక్రమాలను త్వరలోనే బయటపెడతానని, ప్రజల ఎదుటే ఆయన చెంప పగల కొడతానని తేజ్ సంచలన ప్రకటనచేశారు. దీనికి ప్రతిగా తేజ్ చెంప చెళ్లుమనిపించిన వారికి కోటి రూపాయలు ఇస్తానని బీజేపీ నేత ప్రకటించడం విశేషం. సుశీల్ మోడీపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. సుశీల్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని సాహ్ని డిమాండ్ చేశారు. లేకుంటే లాలూ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు. బీజేపీ మాత్రం సాహ్ని వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఆయననుంచి వివరణ కోరామని తెలిపింది. మొత్తం మీద బీహార్ లో బీజేపీ, ఆర్జేడీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

