చివరికి ఆయన ప్రస్థానం కాంగ్రెస్ గూటికి చేరింది

మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లుగా తయారయింది మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ పరిస్థితి. తన రాజకీయ జీవితాన్ని ఆప్ అనూహ్యంగా ఉద్ధరించేసి, తనను ముఖ్యమంత్రి చేసేస్తుందేమో అని కలలు కంటూ.. ఉన్న పదవిని వదులుకుని వచ్చినందుకు ఆయన పరిస్థితి అటూ ఇటూ కాకుండా అయిపోయింది. చివరికి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసుకోవాల్సి వస్తోంది. తనకంటూ ఓ రాజకీయ వేదికను సొంతంగానే సృష్టించుకున్నప్పటికీ.. దానికి ఆదరణ లేక కాంగ్రెస్ పంచన మనుగడ సాగించాల్సిన పరిస్థితి వచ్చింది.
నవజ్యోత్ సింగ్ సిద్ధూకు రాజకీయంగా భాజపా నాయకుడిగానే గుర్తింపు ఉంది. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో తనను కాదని, అరుణ్ జైట్లీని పోటీ చేయించినందుకు ఆయన అలక వహించారు. అలాగని.. ఆ నియోజకవర్గంలో ఆయన కరిష్మా.. జైట్లీ విజయానికి కూడా ఉపకరించలేదు. ఇలాంటి నేపథ్యంలో జైట్లీ ని రాజ్యసభలో కూర్చోబెట్టిన భాజపా, తర్వాత సిద్ధూను కూడా రాజ్యసభ ఎంపీగా చేసింది.
అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వచ్చిన తరుణంలో ఆప్ నుంచి వచ్చిన ఆఫర్ సిద్ధూను ఊరించింది. ఆ పార్టీలో చేరితో.. వేరే ప్రత్యమ్నాయం లేని పంజాబ్ లో తానే ముఖ్యమంత్రి అయిపోవచ్చునని ఆయన కల గన్నారు. ఆ ఆశతో భాజపా తరఫున ఉన్న ఎంపీ పదవికి రాజీనామా చేసి వచ్చేశారు. తీరా కేజ్రీవాల్ తో మంతనాలు ప్రారంభించాక గానీ.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించేది ఉండదని, పైగా ఒక కుటుంబంలో ఇద్దరికి పదవులు అసాధ్యం అని తేలింది. అప్పటికే సిద్ధూ భార్య ఎమ్మెల్యే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలో తాను ఉంటే గనుక.. మంత్రి అవుతానని కలలు కంటున్న వ్యక్తి. ఈ నేపథ్యంలో ఆప్ ఆలోచనను అటకెక్కించిన సిద్దూ సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎటూ బరిలోకి దిగితే పరాభవమే అని తెలుసుకుని, ప్రస్తుతానికి ఎవరికైనా సహకరిస్తాం.. ఈసారి ఎన్నికల నుంచి పోటీచేస్తాం అంటూ సిద్దూ ప్రకటించారు.
ఈలోగా ఆయన భార్య కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. సిద్ధూ అధికారికంగా చేరలేదు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం.. పంజాబ్ ఎన్నికల్లో సిద్దూ తమ పార్టీ తరఫునే ప్రచారం చేస్తాడంటూ ఇప్పటినుంచే చెప్పుకుంటున్నారు.
హాయిగా రాజ్యసభ ఎంపీగా తాను, ఎమ్మెల్యేగా తన భార్యకు పదవులు ఉండగా.. ఎంపీ పదవిని వదులుకుని ఆశకు పోయినందుకు పాపం.. సిద్దూ పరిస్థితి ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అయిపోయింది. పార్టీలోలేకుండా.. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసుకోవాల్సి వచ్చేలా ఉంది.

