చిన్నమ్మకు అన్యాయం చేశారా?

జయలలిత నెచ్చలి శశికళ పట్ల తమిళనాడు ప్రజలు సానుభూతితో ఉన్నారా? చిన్నమ్మను కావాలనే కొందరు కుట్ర పన్ని జైలుకు పంపారా? అంటే అవుననే అంటున్నారు తమిళ ప్రజలు. ఇటీవల తమిళనాడు యూనివర్సిటీ విద్యార్థులు జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. శశికళ శిక్షాకాలం ఏడాది పూర్తయింది. అయితే ఈ సందర్భంగానే ఒక సంస్థ శశికళపై తమిళుల అభిప్రాయాలను సేకరించింది. అయితే ఈ సర్వేలో ఎక్కువమంది శశికళ పట్ల సానుకూలతగా ఉన్నట్లు వెల్లడయింది.
అక్రమంగా ఇరికించారని....
జయలలిత బతికి ఉన్నంతవరకూ రిజర్వ్ లో ఉన్న కేసు చనిపోగానే ఎలా బయటకు వచ్చిందని కొందరు ఈ సందర్భంగా ప్రశ్నించారు. అంతేకాదు జయలలితను మూడు దశాబ్దాల పాటు శశికళ కంటికి రెప్పలా కాపాడిందని కూడా పలువురు అభిప్రాయపడ్డారు. శశికళ తన సొంత కుటుంబాన్ని సయితం వదులుకుని అమ్మ కోసం త్యాగం చేసిందని కొందరు అభిప్రాయపడ్డారు. శశికళను కావాలనే కొందరు ఇరికించారని కూడా చెప్పారు. అక్రమాస్తుల కేసును బయటకు లాగి లోపలికి పంపించిందెవరో అందరికీ తెలుసునని కూడా కొందరు ఎదురు ప్రశ్నలు వేశారు. ఈ సర్వేతో చిన్నమ్మ కు తమిళనాట సానుభూతి పుష్కలంగా ఉందనే అర్థమవుతుందటున్నారు విశ్లేషకులు.
ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ.....
ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో శశికళ మేనల్లుడు దినకరన్ ఘన విజయం సాధించడానికి కూడా ఇది కారణంగా చెబుతున్నారు. ఎంత డబ్బు వెచ్చించినా తమకు నచ్చిన వారికే ప్రజలు ఓటేస్తారు. అలాంటిది ఆర్కే నగర్ లో వన్ సైడ్ పోలింగ్ జరగడానికి చిన్నమ్మపై పెల్లుబుకుతున్న సానుభూతే కారణమంటున్నారు. అధికార అన్నాడీఎంకే పరాజయం పాలవ్వడం, డీఎంకేకు డిపాజిట్లు రాకపోవడానికే సింపతీ కారణమనే వాదన విన్పిస్తోంది. సహజంగా తమిళనాట సానుభూతి పవనాలు ఎక్కువగా వీస్తాయి. జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయంలోనే జైలుకు వెళ్లడంతో శశికళపై తమిళనాడు సానుభూతి పుష్కలంగా ఉందన్నది ఈ సర్వే సారాంశం. మొత్తం మీద శశికళను జయవారసురాలిగా కొందరు నమ్ముతున్నట్లే కన్పిస్తోంది.
జైలు నుంచి వచ్చిన తర్వాత....
శశికళ బయటకు వచ్చిన తర్వాత తిరిగి రాజకీయాలను శాసిస్తారని ఆమె వర్గం నేతలు గట్టిగా చెబుతున్నారు. అందుకే టీటీవీ దినకరన్ ను కొత్త పార్టీ పెట్టే విషయంలో తొందరపడవద్దని చెప్పినట్లు సమాచారం. శశికళ జైలు గోడల నుంచి బయటకు వస్తే అన్నాడీఎంకే నేతలందరూ తన వద్దకు ఖచ్చితంగా వస్తారన్న నమ్మకంతో చిన్నమ్మ ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీ కూడా తన చేతిలోకి వస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. తనను అకారణంగా జైలుకు పంపడం, శశికళ, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులపైన ఐటీ, ఈడీ దాడులు జరగడం వంటివి ప్రజల్లో సానుభూతిని తెచ్చిపెట్టాయంటున్నారు. మొత్తం మీద చిన్నమ్మ జైలు నుంచి వచ్చిన తర్వాత చక్రం తిప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
- Tags
- శశికళ

