‘చిన్నమ్మ’ భక్తులంతా కొత్త రగడ మొదలెట్టేశారు!

తమిళనాట రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ‘అమ్మ’ పురట్చితలైవి జయలలిత మరణించి పూర్తిగా 48 గంటలైనా గడచిందో లేదో అప్పుడే అన్నా డీఎంకే రాజకీయాల్లో లుకలుకలు బయట పడుతున్నాయి. నాయకత్వం గురించిన వివాదాలు అంకురిస్తున్నాయి. జయలలిత వారసుడిగా పన్నీర్ సెల్వం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ పదవిని జయలలిత నెచ్చెలి శశికళకు అప్పగించాలని, ఆమెను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నైలో గురువారం పోస్టర్లు వెలిశాయి.
నిజానికి ఇప్పటికీ అన్నా డీఎంకే పార్టీ మీద శశికళదే పూర్తి స్థాయి పెత్తనం నడుస్తున్నట్లు కొన్ని వదంతులు ఉన్నాయి. మొత్తం పార్టీ వ్యవహారాలను ‘చిన్నమ్మే’ నడిపిస్తున్నదని, ముఖ్యమంత్రి పదవిని తాను తీసుకోకుండా, ఎప్పటిలాగానే.. తమకు వీరవిధేయుడు అయిన పన్నీర్ సెల్వంను కూర్చోబెట్టడం.. వ్యూహంలో భాగమేనని పలువురి అంచనా. తనమీద ఇంకా కేసులు విచారణలోనే ఉన్నందున.. ఆమె పదవికి దూరంగా ఉన్నారే తప్ప.. అధికార దండం ఆమె చేతిలోనే ఉన్నదనే వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే చిన్నమ్మ భక్తులు , ఆమె అలా తెరవెనుక నుంచి నడిపించడాన్ని కూడా సహించకలేకపోతున్నట్లున్నది. ఆమెను తక్షణం సీఎం చేయాలంటూ పోస్టర్లు వెలుస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు అన్నా డీఎంకేలో విబేదాలకు దారితీసే అవకాశం ఉందా అనే దిశగా కూడా కొన్ని ఊహలు సాగుతున్నాయి. ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం వలన.. పన్నీర్ సెల్వం నియామకానికి , శశికళ మద్దతుందనే వాదన కూడా ఒకటుంది.
అయితే పన్నీర్ సెల్వం ను , అధికారికంగా జయలలిత వారసుడిగా ఎన్నుకున్న పార్టీ సమావేశంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లుగా అప్పట్లో బయటకు వచ్చింది. అలాంటి అసంతృప్తులు ముదిరి పార్టీకి చేటు జరిగే అవకాశం ఉందా? అనికూడా కొందరు ఆలోచిస్తున్నారు.
చిన్నమ్మ శశికళ.. చాలా తెలివి గానే పదవికి దూరంగా ఉన్నదని.. కొన్నాళ్లు గడచిన తర్వాత.. పార్టీలో పరిణామాలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, స్థిరపడ్డాయని తేలిన తర్వాత.. పూర్తిస్థాయిలో బహిరంగంగా సారథ్యం స్వీకరిస్తారని పలువురు అనుకుంటున్నారు.

