చిన్నమ్మ ఏం సాధించింది?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళ తిరిగి జైలు కెళ్లిపోయారు. ఐదు రోజుల పెరోల్ ముగియడంతో ఆమె ఈరోజు సాయంత్రం పరప్పణ అగ్రహార జైలుకు వెళ్లిపోయారు. శశికళ భర్త నటరాజన్ కు అస్వస్థతగా ఉండటంతో ఆయనను చూసుకునేందుకు శశికళ పదిహేను రోజుల పాటు పెరోల్ ఇప్పించాలని పిటీషన్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాని ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు రోజులు మాత్రమే శశికళకు పెరోల్ ఇచ్చింది. అది కూడా కొన్ని షరతుల తోటే. ఎటువంటి రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని, రాజకీయ నేతలతో మాట్లాడరాదని, కేవలం ఆసుపత్రిలో ఉన్న భర్త వద్దకు, బంధువుల ఇంటి వద్దే గడపాలని షరతులు విధించింది. అయితే శశికళ ఐదురోజుల పెరోల్ గడువులో నటరాజన్ దగ్గరకు వెళ్లింది కేవలం రెండుసార్లు మాత్రమే. అది కూడా ఆసుపత్రిలో ఆరు గంటలకు మించి ఉండలేదు. ఎక్కువ సమయం తన వదిన ఇళవరసి కూతురి ఇంట్లోనే శశికళ గడిపారు.
తనకు ఇష్టమైన ఫుడ్ తింటూ.....
శశికళ ఈ ఐదు రోజుల పాటు తనకు ఇష్టమైన ఆహారాన్ని వండించుకు తిన్నారు. పరప్పణ అగ్రహారం జైలులో అధికారులకు రెండు కోట్ల లంచం ఎరచూపారని ఆరోపణలు బయటకు రావడంతో జైలులో శశికళ గత రెండు నెలలుగా సాధారణ ఖైదీలాగానే ఉంటున్నారు. దీంతో ఆమె ఫుడ్ కు మొహం వాచిపోయారని తెలిసింది. అందుకే ఈ ఐదు రోజులు తనకిష్టమైన ఆహారాన్ని వండించుకు తిన్నారట శశికళ. ఇక భర్త నటరాజన్ తో అతి తక్కువ సమయమే గడిపారు. మామూలుగా శశికళ, నటరాజన్ లు దాదాపు ముప్ఫయి ఏళ్ల నుంచి విడిపోయే ఉంటున్నారు. జయలలితతో పరిచయం అయిన తర్వాత నటరాజన్ ను జయలలిత బయటకు పంపారు. అయితే శశికళ మాత్రం జయ వెంటే ఉన్నారు. జయలలిత కోసం భర్తను కూడా దూరం చేసుకున్నారు. జయ మరణం తర్వాతనే నటరాజన్ మళ్లీ పోయెస్ గార్డెన్ లోకి అడుగుపెట్టారు. నటరాజన్ వద్ద పెద్దగా గడపక పోవడం వారిద్దరి మధ్య సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. శశికళ ఎక్కువగా రాజకీయాలపైనే ఈ ఐదు రోజులు ఎక్కువగా దృష్టి పెట్టారు. తనకు బెయిల్ తెచ్చేందుకు న్యాయనిపుణులతో సంప్రదించారు. అలాగే తాను నమ్మిన పళనిస్వామి మోసం చేసిన తీరుపై శశికళ ఆగ్రహంగా ఉన్నారు. పళనిస్వామిని ఎలాగైనా గద్దె దించాల్సిందేనని దినకరన్ కు. ఇతర నేతలకు చిన్నమ్మ ఆదేశించినట్లు సమచారం. అయితే ఐదు రోజుల పాటు శశికళ తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు తెస్తుందని ఆ పార్టీ నేతలు భావించారు. కాని ఎమ్మెల్యేలు కూడా పెద్దగా చిన్నమ్మ వైపుకు మొగ్గు చూపలేదు. పళనిస్వామి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో శశికళ వైపు మెజార్టీ ఎమ్మెల్యేలు కన్నెత్తి చూడలేదు. కాని శశికళ పెరోల్ నిబంధనలు ఉల్లంఘించారని ఆ పార్టీనేతలే అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద శశికళకు ఇచ్చిన ఐదు రోజుల పెరోల్ ముగియడంతో మళ్లీ నాలుగు గోడల మధ్యకు వెళ్లిపోయారు.
- Tags
- శశికళ

