చిదంబర రహస్యాన్ని చేధిస్తారా?

మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? చిదంబరాన్ని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారా? అవుననే అంటున్నాయి సీబీఐ వర్గాలు. పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, కార్తీ విచారణ పూర్తయిన తర్వాత చిదంబరాన్ని కూడా విచారించే అవకాశముందంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే చిదంబరం కుమారుడు కార్తీని సీబీఐ అరెస్ట్ చేసింది. కార్తీని విచారించడానికి ఐదు రోజుల పాటు కోర్టు అనమతిచ్చింది. ఈ విచారణలో కార్తీ నుంచి ఏ విషయాలు రాబట్టనుందన్నది చర్చనీయాంశమైంది.
విచారణలో తేలుతుందా?
ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో అప్పటి డైరెక్టర్లు ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ల వాంగ్మూలం ఇప్పుడు కీలకంగా మారనుంది. అప్పటి ఆర్థికమంత్రి చిదంబారాన్ని తాము కలిశామంటూ వారు సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణలో వెల్లడించారు. ఢిల్లీలోని పార్క్ హయత్ హోటల్ లో కార్తీ చిదంబరాన్ని కలిసి తాము ఏడు లక్షల డాలర్లు ఇచ్చినట్లు వారు విచారణలో అంగీకరించారు. దీనిపైనే ఇప్పుడు సీబీఐ అధికారులు కార్తీని విచారించనున్నారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడానికి కార్తీ చిదంబరం లంచం తీసుకున్నారన్నది సీబీఐ అభియోగం.
చిదంబరాన్ని విచారించే అవకాశం....
తండ్రి ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కార్తీ చిదంబరం తనకు సంబంధించిన విదేశీ సంస్థల ద్వారా పది లక్షల అమెరికన్ల డాలర్లు లంచం రూపంలో అందాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనిపై ఆయన అన్ని కోర్టులనూ ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా తనతో పాటు తన కుటుంబ సభ్యులను సీబీఐ, ఈడీలు వేధిస్తున్నాయని, దీన్ని నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరారు. దీంతో పాటు ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులోనూ చిదంబరం పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ గతంలోనే కోర్టుకు తెలిపింది. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ చేస్తోంది. ఇదిలా ఉండగానే కార్తీ కేసులో చిదంబరం పాత్రపైనే సీబీఐ ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. కార్తి చిదంబరం విదేశాల్లో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ అనుమానిస్తుంది. దీనిపై కూడా విచారించనుంది.
- Tags
- చిదంబరం

