చిత్తూరులో జగన్ చించేశారే...!

చిత్తూరు జిల్లాలో జగన్ యాత్రకు మంచి స్పందన లభించింది. జగన్ పాదయాత్ర గురువారం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా ప్రారంభమైంది. 46వ రోజు పాదయాత్ర కావడం... అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావడంతో వైసీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పాదయాత్రను తన భుజానకెత్తుకున్నారు. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుగానే జిల్లాలో కార్యక్రమాలు చేపట్టారు.
వైసీపీ నేతల ముందస్తు చర్యలు...
ఇటీవల చిత్తూరు జిల్లాలో సంభవించిన పరిణామాలు కూడా వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, చిత్తూరు నియోజకవర్గంలో సీకే బాబును పార్టీ నుంచి తప్పించడంతో ఆయన బీజేపీలో చేరిపోయారు. ఇదే జిల్లాకు చెందిన అమర్ నాధ్ రెడ్డి కూడా వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి జంప్ చేసి మంత్రి అయ్యారు. దీంతో వైసీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ కూడా చిత్తూరు జిల్లా నేతలకు ముందుగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పాదయాత్రపై దృష్టిపెట్టి ముందస్తు కార్యక్రమాలు చేపట్టాలని సూచించడంతో నేతలు నడుంవంచి పనిచేశారని చెబుతున్నారు. తొలిరోజు చిత్తూరు జిల్లాలో జగన్ 8.7 కిలోమీటర్లు మాత్రమే నడిచారు. అడుగడుగునా యువకులు, మహిళలు పెద్దయెత్తున తరలి రావడంతో పాదయాత్ర అనుకున్నవిధంగా ముందుకు సాగలేదు.
- Tags
- జగన్

