చంద్రబాబు కేబినెట్లో భారీ మార్పులు.... మార్చికి ఎలక్షన్ కేబినెట్ రెడీ...!

'ఇదే నా ఎలక్షన్ టీమ్! ఈ బృందంతోనే మనం ఎన్నికలకు వెళ్లాలి. ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలి.' ఇదీ గత ఏడాది ఏప్రిల్ 2న కొత్తగా క్యాబినెట్లో చేరిన వారితోనూ, ఇతర మంత్రులతో సీఎం చంద్రబాబు అన్న మాట! ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు గానీ.. ఈ టీమ్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారట. ఎంతో కీలకమైన ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ.. మంత్రుల పనితీరులో మార్పు కనిపించడం లేదని ఒక నిర్ణయానికి వచ్చిన ఆయన.. భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారనే చర్చ మొదలైంది. మార్చి నాటికి దీనికి ఒక తుది రూపు కూడా రాబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న మంత్రి వర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి.. పటిష్టమైన టీమ్‌తో ఎన్నికల్లో అడుగు పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారట.
మంత్రుల పనితీరుపై....
గత మంత్రి వర్గ విస్తరణలో అనూహ్య మార్పులు చేశారు సీఎం చంద్రబాబు! సీనియర్లతో పాటు యువతను కూడా కేబినెట్లోకి తీసుకున్నారు. అదే సమయంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సీనియర్లు అలకపాన్పులు కూడా ఎక్కారు. అయితే వీరందరినీ బుజ్జగిస్తూనే ముందుకెళ్లారు! కొత్త మంత్రి వర్గం ఏర్పడి ఏడాది కూడా కాకముందే.. కొంత మంది మంత్రుల పనితీరుపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఆశించిన స్థాయిలో వారి పనితీరు లేదని నివేదికలు చెబుతున్నాయట. అంతేగాక మరికొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం, ఇంకొందరిపై అవినీతి ఆరోపణలు వస్తుండటంతో వీరిపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది! కొంతమంది మంత్రులు నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు! వీటన్నింటినీ గమనించిన ఆయన.. ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారట.
అంచనాలు అందుకోలేక....
తొలి నుంచి చంద్రబాబు కేబినెట్‌పై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. మంత్రులు సరైన అంచనాలు అందుకోవడం లేదని సర్వేల్లోనూ తేలింది. అయితే ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వస్తున్నారు సీఎం. ఇక ప్రధానంగా ఈ ఏడాది మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. అందులో రెండు టీడీపీకి దక్కబోతున్నాయి. ఇందులో ఒక స్థానానికి ప్రస్తుత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కొత్తగా ఆస్థానంలో వేరొకరిని నియమించాలి. ఈ నేపథ్యంలోనే అంత సమర్థంగా ఆ బాధ్యతను ఎవరు నిర్వర్తిస్తారనే అంశంపై ఇప్పటికే చర్చ మొదలైంది.
ఈసారి వారికి దక్కేనా?
పనితీరు సరిగా లేదని భావిస్తున్న మంత్రుల్లో ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాలకు చెందిన వారు ఉన్నారని, వీరిపై వేటు తప్పదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇతర సామాజికవర్గాల వారిని కూడా కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం గిరిజనులు, మైనారిటీ వర్గాలకు చెందిన వారెవరికీ మంత్రి టికెట్ దక్కలేదు. ఈ అసంతృప్తి ఆయా వర్గాల్లో తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ముఖాలు కనిపించడం ఖాయమని స్పష్టమవుతోంది.

