చంద్రబాబుకు మరోసారి షాక్...!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మళ్లీ హస్తినలో చుక్కెదురైంది. ప్రధాని మోడీని కలిసేందుకు చంద్రబాబు అనేకసార్లు ప్రయత్నిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీలను అమలుపర్చాలని కోరడం, తనకు ప్రధాన ప్రత్యర్థి జగన్ విషయమై చర్చించేందుకు చంద్రబాబు మోడీ అపాయింట్ మెంట్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తాజాగా శుక్రవారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీని కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన శుక్రవారం ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ లను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు విడుదల చేయకుంటే అనుకున్న సమయానికి పూర్తి చేయలేమని చెప్పారు.
ఈసారి కూడా కలవకుండానే....
మరోవైపు నియోజకవర్గాల పెంపుదలపై రాజ్ నాథ్ సింగ్ తో చర్చించారు. నితిన్ గడ్కరీని కలిసి పోలవరం కాంట్రాక్టు నుంచి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని ఎందుకు తప్పించాలనుకుంటారో వివరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. అయితే ప్రధాని దర్శనం మాత్రం లభించలేదు. చంద్రబాబు మోడీని కలిసి దాదాపు ఏడాదిన్నర పైనే అయింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో మాత్రం ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడారు. అయితే ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధానిని కలుద్దామన్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలించడం లేదు. అలాగే మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఏకంగా మోడీని కలిసి అరగంటకు పైగా చర్చలు జరపడం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. మొత్తం మీద మోడీకి, చంద్రబాబుకు మధ్య గ్యాప్ పెరిగిందన్నది మాత్రం అర్థమయింది.

