చంద్రబాబుకు మరో ఝలక్ కేంద్రం ఇవ్వనుందా?

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ కూడా ఈ ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది. స్థానిక బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు పోలవరంపై కేంద్రానికి అప్ డేట్స్ ఇస్తున్నారు. కాంట్రాక్టర్ ను మార్చాలన్న నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టరు ఉన్నట్లుండి మారిస్తే మరో 30 శాతం అదనపు భారం ప్రాజెక్టుపై పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే కాంట్రాక్టరును తొలగించేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. అయితే దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లే ముందు జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో దాదాపు గంటసేపు భేటీ అయి కాంట్రాక్టరును ఏ పరిస్థితుల్లో మార్చవలసి వస్తున్నదీ వివరించారు.
నేడు పోలవరం పరిశీలన......
ఈ నేపథ్యంలో పోలవరంపై సమగ్ర నివేదికను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మసూద్ హుస్సేన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈరోజు పోలవరం పనులు క్షేత్రస్థాయిలో ఏమేరకు జరుగుతున్నాయో పరిశీలించనుంది. ప్రాజెక్టు తొలి నుంచి ఇప్పటి వరకూ జరిగిన పరిస్థితులపై అథ్యయనం చేయనుంది. మసూద్ హుస్సేన్ కమిటీ సోమవారం ప్రాజెక్టును పరిశీలించి మంగళవారం కేంద్రానికి నివేదికను ఇవ్వనుంది. ఈ నివేదికపై బుధవారం చర్చించి పోలవరం ప్రాజెక్టుపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం మీద పోలవరం పై కేంద్రం సీరియస్ గానే ఉందని దీన్ని బట్టి అర్థమయి పోతోంది.
- Tags
- పోలవరం

