చంద్రబాబుకు కొంత ఇబ్బందే....!

టీటీడీ పాలకమండలిని నియమిస్తానని చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే ఆయన టీటీడీ పాలకమండలిని నియమిస్తానని చెప్పడంతో ఆశావహులు ఇక అమరావతికి క్యూకట్టే అవకాశం ఉంది. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి టీటీడీకి పాలకమండలి లేదు. పాలకమండలి లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. పాలకమండలి లేకపోవడంతో అంతా అధికారుల ఇష్టారాజ్యమై పోయిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దర్శనం టిక్కెట్లు పెంచడం, లడ్డూల ధరలను పెంచడం వంటి నిర్ణయాలను ఏకపక్షంగా అధికారులు తీసుకున్నారు. ఇందుకు పాలకమండలి లేకపోవడమే కారణమని చెప్పక తప్పదు.
పుట్టాను నియమించాలని....
అయితే టీటీడీ ఛైర్మన్ గా మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించాలని దాదాపు నాలుగు నెలల క్రితమే చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు జీవో కూడా విడుదలవుతుందని వార్తలొచ్చాయి. అయితే పుట్టా సుధాకర్ యాదవ్ మీద ఆరోపణలు రావడంతో ఈ నియామకంపై చంద్రబాబు వెనక్కు తగ్గారు. పుట్టా క్రైస్తవ సభలకు విరాళాలివ్వడమే కాకుండా, వాటికి హాజరయ్యారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో హిందూసంఘాల నుంచి సుధాకర్ యాదవ్ నియామకంపై వ్యతిరేకత వెలువడింది. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి ఫైలును చంద్రబాబు పక్కన పెట్టేశారు.
డీఎల్ ను దరిచేర్చుకోవాలంటే...
అయితే మైదుకూరులో డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకోవాలంటే సుధాకర్ యాదవ్ కు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆయనకు టీటీడీ ఛైర్మన్ గా ఇస్తే డీఎల్ రవీంద్రారెడ్డికి వచ్చే ఎన్నికల్లో మైదుకూరు సీటును కేటాయించే వీలుంది. అందుకోసమే డీఎల్ వెయిట్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే పుట్టా సుధాకర్ యాదవ్ నియామకంపై ఆర్ఎస్ఎస్ కూడా ఆగ్రహంతో ఉంది. సంఘ్ పరివార్ నేరుగా టీటీడీ పాలకమండలి విషయంలో జోక్యం చేసుకుంటోందన్న వాదన విన్పిస్తోంది. సుధాకర్ యాదవ్ ను నియమించవద్దని ఇప్పటికే చంద్రబాబుకు సంఘ్ పరివార్ నుంచి సమాచారం అందినట్లు చెబుతున్నారు.
ఇద్దరు బీజేపీ నేతలకు సభ్యులుగా....
టీటీడీ పాలకమండిలిలో ఇద్దరు బీజేపీ నేతలకు సభ్యులుగా అవకాశం ఇస్తామని టీడీపీ సర్కార్ చెబుతోంది. పుట్టా సుధాకర్ యాదవ్ ను ఛైర్మన్ గా నియమిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి మాణిక్యాలరావు హెచ్చరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. చంద్రబాబు మాత్రం టీటీడీ పాలకమండలిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని వెంకన్న సన్నిధిలో ప్రకటించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- చంద్రబాబు టీటీడీ

