చంద్రబాబు మంత్రుల మాట వినింది ఇది ఒక్కటేనట

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకదానికి ఒకటి బేరీజు వేసుకుంటున్నాయి. అక్కడి పథకాలు... ఇక్కడ ...ఇక్కడ పథకాలు అక్కడ అమలు చేస్తే ఎలా ఉంటుందని అంచనా వేసుకుంటున్నాయి. పథకం బాగుంటే తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు ఎవరూ వెనుకాడటం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండు విడిపోయినా ప్రజలు కూడా రెండు రాష్ట్రాల బాగోగులు తెలుసుకుంటూనే ఉన్నారు. ఏ రాష్ట్రంలో చిన్న ఎన్నిక జరిగినా రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. రెండు రాష్ట్రాల్లోనూ సెటిలర్లు ఉన్నారు. తెలంగాణలో ఆంధ్ర సెటిలర్లు ఎక్కువేననుకోండి. అయితే చిన్న చిన్న పథకాలను తాము అందిపుచ్చుకునేందుకు ఎవరు కూడా వెనకడుగు వేయడం లేదు. కాపీ కొట్టారని ఎవరో అనుకుంటారని పక్కన పెట్టడం లేదు. అయితే పథకం తీరు మార్చి అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాయి రెండు రాష్ట్రాలు. అయితే పథకాల అమలులో సమస్య వస్తే మాత్రం వాటిల్లో ఛేంజెస్ చేసేస్తున్నారు.
బట్టలు వద్దు... నగదే ముద్దు.....
ఉదాహరణకు తెలంగాణలో ఇటీవల బతుకమ్మ సందర్భంగా కేసీఆర్ సర్కార్ కోటిన్నర మంది పేదలకు బతుకమ్మ చీరలను ఉచితంగా పంపిణీ చేసింది. రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ ఈ చీరలను పంచాలని నిర్ణయించారు. మొత్తం కోటి నాలుగు లక్షల మంది పేదమహిళలున్నట్లు తేలారు. ఆధార్ కార్డు ఆధారంగా బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. అయితే అక్కడక్కడా చిన్న లోపాలు జరిగినా చీరల పంపిణీకి మంచి రెస్పాన్సేలభించింది. దీంతో ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి చంద్రన్న పెళ్లికానుక అని నామకరణం చేశారు. ఈ పథకం కింద పెళ్లి చేసుకునే పేద జంటలకు ఇరవై అయిదు వేల రూపాయల నగదు, ఐదు రూపాయల విలువైన బట్టలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనిపై కొందరు మంత్రులు చంద్రబాబు వద్ద అభ్యంతరం చేశారు. మొత్తం ముప్ఫయి వేల రూపాయలు నగదు రూపంలోనే ఇవ్వడం మంచిదని చెప్పారట. తెలంగాణలో బతుకమ్మ చీరలకు మంచి స్పందన లభించినా నాసిరకం చీరలు పంపిణీ చేశారని విపక్షాలు నానా రాద్ధాంతం చేశాయని, ఇక్కడ కూడా బట్టలు పంపిణీ చేస్తే విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. అవును.... నిజమే కదా?.. అనవసరంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడం ఎందుకు? నగదు రూపంలోనే ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారట. సలహా ఇచ్చిన మంత్రులకు చంద్రబాబు నుంచి శభాష్ లు లభించాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో పథకాలను గమనిస్తూ లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకు వెళుతున్నాయన్నమాట.
- Tags
- చంద్రబాబు

