చంద్రబాబు న్యూఇయర్ గిఫ్ట్ ‘అందరికీ ఆరోగ్యం’

రాష్ట్ర వైద్య- ఆరోగ్య రంగాన్ని సమూలంగా మార్చివేసే రెండు విప్లవాత్మక పథకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఏడాదిలో శ్రీకారం చుట్టనున్నది. దేశంలోనే ప్రప్రధమంగా ‘అందరికీ ఆరోగ్యం’ పేరుతో రాష్ట్రంలో వున్న ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని వచ్చే జనవరి 1 వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందే ‘స్వస్థ్య విద్యావాహిని’ పేరుతో ప్రభుత్వం చేపట్టిన మరో ముఖ్యమైన కార్యక్రమాన్ని పెద్దఎత్తున ప్రారంభించాలని మంగళవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలిచ్చారు. వచ్చే డిసెంబర్ నెల నాలుగవ శనివారం (24 వ తేదీ) నాడు ఈ స్వస్థ్య విద్యావాహిని పథకాన్ని రాష్ట్రంలోని 222 ప్రదేశాల నుంచి ఒకేసారి ప్రారంభిస్తారు.
ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 4 కోట్ల మంది ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు. వీరందరికీ 1044 రకాల వైద్య సేవలు అందుతున్నాయి. అలాగే, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు కలిపి మరో 16.13 లక్షల మందికి 1885 రకాల వైద్య సేవలు అందుతున్నాయి. వీరుగాక రాష్ట్రంలోని మిగిలిన కుటుంబాలకు కూడా వైద్య బీమా సదుపాయం కల్పించడం ద్వారా రాష్ట్ర జనాభా మొత్తానికి వైద్య సంరక్షణ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించనున్నదని ఈ సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబం కొంత ప్రీమియం చెల్లించాల్సివుంటుంది. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు రూ.5 వేల మొదలు ప్రీమియం వసూలు చేసి ఆరోగ్య బీమా కల్పిస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకంలో భాగంగా కుటుంబంలోని ఒక్కొక్క వ్యక్తి నెలకు రూ.100 ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకాన్ని నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా అమలు చేస్తారు. ఆరోగ్య బీమా మీద ఆసక్తి వున్న కుటుంబాలే ఈ పథకంలో చేరవచ్చు. వద్ద్దనుకుంటే లేదు. ఆరోగ్య సంరక్షణపై ప్రజలందరికీ అవగాహన కల్పించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలనేది ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దేశంలో ఈ తరహా కార్యక్రమం అమలు చేయనున్న తొలి రాష్ట్రం ఏపీయే అవుతుంది. ఏటా మొదటి రెండు నెలలలో ప్రీమియం చెల్లింపులు, ఎన్రోల్మెంట్ ప్రక్రియలను పూర్తిచేస్తారు. ప్రీమియం చెల్లింపులన్నీ పారదర్శకంగా వుండేలా ఎలక్ట్రానిక్ చెల్లింపులను మాత్రమే అనుమతిస్తారు.
మొత్తం ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘హెల్త్ ఇన్సూరెన్స్ కమిషన్’ ఏర్పాటుచేస్తుంది. దీనిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, బిల్ గేట్స్ ఫౌండేషన్ తదితర సంస్థల ప్రతినిధులు, ఆరోగ్య రంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులను భాగస్వాముల్ని చేయనుంది. శాస్త్రీయ పద్ధతులను అనుసరించి హెల్త్ ఇన్సూరెన్స్ కమిషన్ పథకం పర్యవేక్షణ చేస్తుంది.
ఇన్సూరెన్స్ విధానంలో అమలులో వున్న గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను సంపూర్ణంగా అధ్యయనం చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మార్గదర్శకాలను క్రోడీకరించి ఈ పథకాన్ని రూపొందించినట్టు అధికారులు సమావేశంలో తెలియజేశారు. ఈ విధానంలో క్లినికల్ ఆడిట్ వ్యవస్థను తప్పనిసరి చేయనున్నారు. క్లినికల్ ఆడిటింగ్ ఇకపై థర్డ్ పార్టీ సంస్థలతో చేయిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ పథకానికి మొత్తం రూ.160.56 కోట్లు అదనంగా ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. వచ్చే బడ్జెట్లో ఈ మేరకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. పథకం, కమిషన్ ఏర్పాటు అంశాలపై విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
స్వస్థ్య విద్యావాహిని పథకం విద్యార్థులకు ఉద్దేశించినది. బాలబాలికలను సరైన పౌష్టికాహారం అందించడం, ఆరోగ్య సంరక్షణపై వారికి అవగాహన కల్పించడం, వారిలో ఇమ్యూనిటీ పెంచడం ఈ పథకం లక్ష్యాలు. ప్రతి విద్యార్థికి ఒకరోజు ఆహారానికి చేసే ఖర్చు కింద రూ.100 కేటాయించాలని వైద్యఆరోగ్యశాఖ ప్రతిపాదిస్తోంది. దీనికోసం రూ.20 కోట్లు ఖర్చుకాగలదని అంచనా వేసింది. ఈ రెండు పథకాలను కొత్త సంవత్పర కానుకగా ప్రజలకు అందివ్వాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చెప్పారు.

