చంద్రబాబు నుంచి డైరెక్షన్ వచ్చినట్లుందే?

రేవంత్ రెడ్డిపై ఎదురు దాడికి దిగాలని అధినేత చంద్రబాబు నుంచి ఆదేశాలు వచ్చినట్లున్నాయి. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రేవంత్ వ్యవహారం మొత్తం అడిగి తెలుసుకున్నారు. ఏపీ మంత్రులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని చంద్రబాబు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వెంటనే మంత్రి చినరాజప్ప రంగంలోకి దిగారు. అలాగే పయ్యావువ కేశవ్ కూడా మనసు విప్పి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతపై నేరుగా ఆరోపణలు చేసి వారం రోజులు గడుస్తోంది. యనమల రామకృష్ణుడు తెలంగాణలో రెండువేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను దక్కించుకున్నారని, పరిటాల సునీత కుటుంబం తెలంగాణలో బీర్ల ఫ్యాక్టరీకి కేసీఆర్ లైసెన్సు ఇచ్చారని ఆరోపించారు. అయితే ఇక్కడే ఉన్న పరిటాల సునీత దీనిపై స్పందించలేదు. అలాగే యనమల రామకృష్ణుడు చంద్రబాబుతో విదేశీ పర్యటలో ఉన్నారు.
లోకేష్... వెనకుండి.....
దీంతో యనమల రామకృష్ణుడు తరుపున అదే జిల్లకు చెందిన హోంమంత్రి చినరాజప్ప రంగంలోకి దిగారు. యనమలను విమర్శించే స్థాయి రేవంత్ కు లేదని చినరాజప్ప అన్నారు. రేవంత్ రెడ్డికి పార్టీతో ఇబ్బందులు ఉంటే అధినేత చంద్రబాబుతో చెప్పి పరిష్కరించుకోవాలి గాని, తమపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ తో ఏపీ మంత్రులకు సంబంధాలున్నాయని రేవంత్ బురద జల్లడంపై చినరాజప్ప ఆవేదన చెందారు. పార్టీ మారానుకునే వాళ్లే ఇలాంటి ఆరోపణలు సహజంగా చేస్తుంటారని చినరాజప్ప అభిప్రాయపడ్డారు. చినరాజప్ప తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. దీంతో లోకేష్ డైరెక్షన్ లోనే చినరాజప్ప రేవంత్ పై విమర్శలు చేసినట్లు సమాచారం. అలాగే పయ్యావుల కేశవ్ కూడా రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి లోకేష్ కారణమని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేలోగా టీటీడీపీ తో పాటు ఏపీ మంత్రులు డ్యామేజీ కాకుండా చిన బాబు రంగంలోకి దిగి రేవంత్ పై ఎదురుదాడిని ప్రారంభించారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

