చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్?

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసినా ఆయన ఎమ్మెల్యేగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. రేవంత్ రాజీనామా లేఖ ఇప్పటికీ స్పీకర్ కు అందలేదు. దీంతో ఆయన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నట్లయింది. రేవంత్ రెడ్డి టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఆ రెండు లేఖలను చంద్రబాబు పేషీలో ఇచ్చి వచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖను స్పీకర్ కు పంపించాల్సిన రేవంత్ పార్టీ అధినేత చంద్రబాబుకు ఇచ్చి రావడం, చంద్రబాబు ఈ రాజీనామా లేఖను తన వద్దే అట్టిపెట్టుకోవడంతో సాంకేతికంగా రేవంత్ ఇప్పుడు ఎమ్మెల్యేగానే చలామణి అవుతారు. అయితే ఆయన తన గన్ మెన్లను వెనక్కు పంపారు. అసెంబ్లీ భవనంలో తన కార్యాలయాన్ని కూడా ఖాళీ చేశారు. తనకు కేటాయించిన క్వార్టర్ ను కూడా ఖాళీ చేశారు. గత వారం రోజులుగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ కార్యక్రమాలకు కూడా హాజరుకావడం లేదు.
స్పీకర్ కు రాజీనామా పంపకుండా.....
అయితే రాజీనామా లేఖను మాత్రం చంద్రబాబు స్పీకర్ కార్యాలయానికి పంపక పోవడం చర్చనీయాంశమైంది. రేవంత్ పార్టీని వీడేటప్పుడు గాని, ఆత్మీయులతో జరిగిన సమావేశంలోగాని చంద్రబాబును విపరీతంగా పొగిడేశారు. చంద్రబాబు కూడా టీటీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో రేవంత్ ను ఒక్క మాట కూడా అనలేదు. అంటే వీరిద్దరి బంధం చెప్పకనే తెలుస్తోంది. ఇప్పుడు రాజీనామా లేఖను స్పీకర్ కు పంపితే దానిని ఆమోదిస్తే ఉప ఎన్నిక తథ్యమవుతుంది. కొడంగల్ ఉప ఎన్నిక వస్తే టీడీపీ కూడా పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రావన్న భయం పట్టుకుంది. ఇప్పటికే రేవంత్ వెంట కొందరు కాంగ్రెస్ గూటికి వెళ్లగా, కొడంగల్ కు చెందిన కొందరు టీడీపీ నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఉప ఎన్నిక రాకుండా చూసేందుకే చంద్రబాబు రేవంత్ రాజీనామా లేఖను స్పీకర్ కు పంపడంలో జాప్యం చేస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద రేవంత్ తెలివిగా చేశారా? లేక చంద్రబాబు డైరెక్షన్ లోనే రేవంత్ వ్యవహరించారా? అన్న చర్చ కాంగ్రెస్ లోనూ, టీటీడీపీలోనూ జరుగుతుంది.
- Tags
- రేవంత్ చంద్రబాబు

