చంద్రబాబు ఇమేజ్ పెరగడానికేనా?

విశాఖ పెట్టుబడుల సదస్సు ఎన్ని ఎంవోయులు కుదుర్చుకుంది? ఎన్ని కోట్ల రూపాయలు ఏపీకి పెట్టుబడులు వచ్చాయి? ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నది పక్కన పెడితే చంద్రబాబు ఇమేజ్ మాత్రం పెరిగే అవకాశముంది. విశాఖలో ఇటువంటి సదస్సు నిర్వహించడం ఇది మూడోసారి. ఈ సదస్సులోనూ నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 734 ఒప్పందాలు జరిగాయని, దాదాపు పదకొండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నది ప్రభుత్వం చెబుతోంది. భాగస్వామ్య సదస్సులు ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్తేమీ కాదు.
గ్రౌండ్ అయిన పరిశ్రమలెన్ని....
గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని ఇటువంటి సదస్సులనే నిర్వహించారు. గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న సదస్సులకు మంచి స్పందన లభిస్తుందని, రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చి పడిపోతున్నాయని చంద్రబాబు తరచూ చెబుతున్నారు. అయితే ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థల్లో దాదాపు పదిశాతం కూడా గ్రౌండ్ కావడం లేదన్నది అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. అయితే ఇటువంటి సదస్సులు చంద్రబాబుకు మంచి మైలేజీని తెచ్చిపెడతాయి. ముఖ్యంగా యువతలో ఇటువంటి సదస్సులు పెట్టడం వల్ల ప్రభుత్వం పట్ల పాజిటివ్ థృక్పథం ఏర్పడుతుందన్నది ఒక విశ్లేషణ.
నిత్యం శ్రమిస్తున్నారన్న....
అంతేకాదు చంద్రబాబు రాష్ట్రం కోసం నిత్యం శ్రమిస్తున్నారన్న విషయమూకూడా ప్రజల్లోకి సులువుగా వెళుతుంది. ఇటీవల అనంతపురంలో శంకుస్థాపన చేసిన కియో కార్ల ఫ్యాక్టరీకి సంబంధించిన ఆ వాహనాలను మాత్రం భాగస్వామ్య సదస్సు ప్రాంగణంలో ఉంచారు. నిజంగా గత రెండు భాగస్వామ్య సదస్సుల్లో ఎంవోయూలు కుదుర్చుకుని పరిశ్రమలను ప్రారంభించినట్లయితే వాటికి సంబంధించిన వివరాలను కూడా ఈ ప్రాంగణంలో ఖచ్చితంగా ఉంచేవారని, అయితే ఏపీకి ఎలాంటి పరిశ్రమ రాలేదన్నది దీనిబట్టే అర్థమవుతుందన్నది విపక్షాల వాదన.
శ్వేతపత్రం విడుదల చేయాలంటున్న విపక్షం....
అయితే లక్షలక కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న చంద్రబాబు దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని విపక్షాలు కోరుతున్నాయి. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికిే ఇటువంటి సమ్మిట్ లను ఏర్పాటు చేస్తున్నారని విపక్ష వైసీపీ ఆరోపిస్తుంది. ఈ సదస్సుల పేరిట వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనికూడా విమర్శిస్తోంది. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ ఈ సదస్సులు చంద్రబాబుకు మంచి ఇమేజ్ తెచ్చిపెడతాయన్నది తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయం. విపక్షాలు ఎన్ని అనుకున్నా తాము నిర్వహించిన పెట్టుబడుల సదస్సు విజయవంతమైందని, దీని ఫలితాలను భవిష్యత్తులో చూస్తారని టీడీపీ నేతలు అంటున్నారు.
- Tags
- చంద్రబాబు

