చంద్రబాబు అలెర్ట్ అయి...నేరుగా నేతలతో...!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలపై దృష్టిపెట్టారు. వివిధ జిల్లాల్లోనేతల మధ్య విభేదాలను తొలగించేందుకు ఆయన నడుంబిగించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో టీడీపీ నేతల మధ్య పొసగడం లేదు. దీనికి తోడు వైసీపీ నుంచి వచ్చి చేరిన 23 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అక్కడ ఎమ్మెల్యేలకు, ఇన్ ఛార్జులకు అస్సలు పడటం లేదు. ఇటీవలజన్మ భూమి కార్యక్రమంలోకూడా ఈ విభేదాలు బట్టబయలయ్యాయి. రెండు గ్రూపులుగా విడిపోవడంతో పార్టీ కార్యక్రమాలు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో క్యాడర్ లో కూడా అయోయమం నెలకొంది. దీంతో చంద్రబాబు ఈరోజు నుంచి రోజుకొక్క జిల్లా నేతలతో సమావేశమవ్వాలని నిర్ణయించారు.
నేతల మధ్య విభేదాలు....
ఈరోజు కర్నూలు జిల్లా నేతలతో ఆయన జిల్లా భేటీలు ప్రారంభం కానున్నాయి. కర్నూలు జిల్లాలో నేతల మధ్య సయోధ్య లేదు. కర్నూలు జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇన్ ఛార్జి మంత్రి వల్ల కూడా విభేదాలు పరిష్కారం కాకపోవడంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. కర్నూలు సిటీలో టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డికి పడటం లేదు. సీటు కోసం వీరి కొట్లాట జన్మభూమి బహిరంగ సభల్లో పార్టీని నవ్వుల పాలు జేసింది. ఇద్దరూ టిక్కెట్ తమకంటే తమకేనని సభల్లో చెప్పుకోవడంతో పార్టీకి ఇబ్బందిగా మారింది.
నేటి నుంచి వరుసగా....
మరోవైపు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పార్టీలో చేరిన తర్వాత కూడా పార్టీలో రెండు గ్రూపులయ్యాయి.ఇక ఆళ్లగడ్డ, నంద్యాలల్లో భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిలు ప్రాధాన్యత వహిస్తున్నారు. ఇక్కడ ఏవీ సుబ్బారెడ్డి విందులపేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ద్వితీయ శ్రేణి నేతలను దగ్గరకు తీసుకుంటున్నారు. మరోవైపు అఖిలప్రియ కార్యకర్తలకు అందుబాటులో ఉండక పోవడంతో ఎక్కువగా ఏవీసుబ్బారెడ్డి వైపు వెళుతున్నారు. అలాగే ఇదే నియోజకవర్గంలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మరో గ్రూపును మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ఇలా అనేక నియోజకవర్గాల్లో పార్టీ విభేదాలు వివిధ సందర్భాల్లో బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో సమావేశం అవుతున్నారు. వారి మధ్య విభేదాలను తొలగించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతల మధ్య విభేదాలు పార్టీ కొంపముంచుతాయని భావించిన చంద్రబాబు అలర్ట్ అయ్యారు.
- Tags
- చంద్రబాబు

