చంద్రబాబు అనుకున్నదానికి విరుద్థంగా...?

ఏపీ ముఖ్యమంత్రి ఎన్నడూ లేని విధంగా హస్తినలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గతంలో ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు కనీసం చిన్న చిన్న పనులను కూడా చేయించుకోలేని పరిస్థితి. పోలవరం, విభజనసమస్యలను పక్కన పెడితే చివరకు డీజీపీ నియామకంపై కూడా కేంద్రం కొర్రీలు వేయడం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ప్రస్తుత ఇన్ ఛార్జి డీజీపీ సాంబశివరావునే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాంబశివరావుతో పాటుగా రమణమూర్తి, మాలకొండయ్యల పేర్లు కూడా కేంద్ర హోంశాఖకు పంపింది. అయితే వీరి ముగ్గరు కూడా ఏడాది లోపే పదవీ విరమణ చేస్తుండటంతో దానికి కేంద్రం అభ్యంతరం తెలిపింది. ఏడాది లోపు పదవీ విరమణ చేసే వారిని డీజీపీలుగా నియమించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ఉటంకించింది.
డీజీపీ నియామకం కష్టమే.....
ఏడాది లోపు పదవీ విరమణ చేసే వారిని డీజీపీగా నియమిస్తే వారు ప్రభుత్వ వత్తిడులకు తలొగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనీసం రెండేళ్లు పదవీకాలం ఉన్నవారినే డీజీపీగా నియమించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వత్తిళ్లు, రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా పనిచేయాలంటే కనీసం పదవీకాలం రెండేళ్లు ఉండటం అవసరమని సుప్రీంకోర్టు 2006లో తీర్పు చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పంపిన ముగ్గురు అధికారుల జాబితాను కేంద్రం వెనక్కు పంపింది. సాంబశివరావు ఈ ఏడాది డిసెంబరుతో పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు మరో రెండేళ్లు పదవీకాలాన్ని పొడిగించాలన్నది ప్రభుత్వ యోచన. అయితే కేంద్ర హోంశాఖ నిర్ణయం మేరకు ఆయనకు పదవీ కాలం పొడిగించే అవకాశం ఉండకపోవచ్చు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖతో చర్చించాలని చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. మొత్తం మీద చంద్రబాబుకు దెబ్బ దెబ్బ మీద తగులుతోంది.
- Tags
- చంద్రబాబు

