చంద్రగ్రహణం రోజున సిటీలో ఆ చిన్నారిని....!

క్షుద్రపూజ ఈ మాట మనం పల్లెటూళ్లలో బాగా వింటాం... అమావాస్య.. గ్రహణం పట్టినప్పుడు మంత్రాలు వచ్చిన వాళ్లు చేస్తుంటారు.. ఆ రోజు చాలా పవర్ ఫుల్ అని భావించి మేకనో... లేక కోడినో బలిస్తారు.. అందుకే గ్రామ శివారు ప్రాంతాల్లో ఆ రోజున రాత్రి పూట తిరగాలంటే జనం భయపడిపోతారు.. బట్ ఈ పూజలు ఇప్పుడు సిటీ వాసులను కూడా వణికిస్తున్నాయి. చంద్రగ్రహణం మరుసటి రోజున ఓ చిన్నారి తల జనాలను అదిరిపోయి బెదిరిపోయేలా చేసింది.
చిలుకా నగర్ లో ఘటన....
అయితే ఇప్పుడు ఈ క్షుద్రపూజలు సిటీ వాసులను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని ఉప్పల్ లో ఇలాంటి ఘటననే వెలుగుచూసింది. చిలుకా నగర్ లో నివసించే రాజశేఖర్ వృత్తి రీత్యా కారు డ్రైవర్.. ఉదయాన్నే తన ఇంటిపై ఓ మూడునెలల చిన్నారి మొండెం చూసి బెదిరిపోయి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలియగానే ఉప్పల్ పోలీసులతో పాటు.. ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగారు.. డాగ్ స్క్వాడ్.. క్లూస్ టీం సైతం ఘటన స్థలాన్ని పరిశీలించాయి.
మూడు నెలల చిన్నారిని బలి ఇచ్చారా?
హత్య జరిగిన తీరు చూస్తే ఎవరో మూడునెలల చిన్నారిని దారుణంగా హతమార్చి చప్పుడు కాకుండా రాజశేఖర్ ఇంటిపై పడేసి వెళ్లి ఉంటారు.. అయితే ఆ చిన్నారి మిగతా సగం శరీర భాగం ఎక్కడ ఉందన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బుధవారం చంద్రగ్రహణం కోసం ఎవరో క్షుద్రపూజలు చేసి పాపను బలిచ్చారంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో విషయం పాకిపోయింది. దీంతో వందలాది మంది జనం చిలుకానగర్ కు చేరుకున్నారు. కేసు దర్యాప్తు కన్నా వచ్చిన జనాన్ని అదుపు చేయలేక పోలీసులు నానా అవస్థలు పడ్డారు. సాధారణంగా ఇలాంటి క్షుద్రపూజలు పాతబస్తీ లో జరుగుతుంటాయని స్థానికులు చెప్పడంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టారు. నిజంగా చంద్రగ్రహణం కోసం పాపను బలిచ్చారా అన్న అనుమానం ఇప్పుడు పోలీసులను కూడా వెంటాడుతోంది. ఇంతకీ హత్య గావించ బడ్డ చిన్నారి తల్లిదండ్రులు ఎవరూ.. హత్య ఎక్కడ జరిగింది.. మిగతా శరీర భాగం ఎక్కడ ఉంది అన్న ఆధారాల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పాతబస్తీలో చిన్నారిని బలిస్తే తల భాగాన్ని ఎలా చిలుకానగర్ వరకు తీసుకు వచ్చారు అన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. గేటుకు తాళం వేసి ఉన్న రాజశేఖర్ ఇంటిపై తలను ఎలా వదిలిపెట్టారు. లోపలికి దుండగులు ఎలా వచ్చారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సిసి కెమేరాలను పరిశీలిస్తున్నారు. మొత్తానికి చంద్రగ్రహణం చిలుకానగర్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. బలైన చిన్నారి ఎవరో తెలిస్తే కానీ ఈ కేసు చిక్కుముడి వీడేలా లేదు.

