గ్రేటర్ జలగల్లో గుండెదడ !

గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఎంత అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ అనుమతులు ఇచ్చేస్తూ ఉంటారో, అక్రమ నిర్మాణాల పట్ల కళ్లు మూసుకుని వ్యవహరిస్తూ ఉంటారో.. అందరికీ తెలుసు. కానీ.. వారి దుర్మార్గాల వల్ల ఎలాంటి విపరిణామాలు చోటుచేసుకుంటాయో.. ఎన్ని దారుణాలు జరుగుతాయో... జన జీవితం ఎంతగా ఛిద్రం అయిపోతుందో.. మొన్నటి వర్షాల సందర్భంగా బయటపడింది. అప్పటినుంచి గ్రేటర్ అధికార్ల అవినీతి మీద సర్కారు కాస్త కన్నేసినట్లే ఉంది. ఇప్పుడు ఒక్కరొక్కరి మీదా ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. కోట్లకు కోట్ల రూపాయలు కాజేస్తున్న వారిని ఏసీబీ ఏరిపారేయడానికి ప్రయత్నిస్తోంది.
జీహెచ్ఎంసీ అధికారులకు ఏసీబీ ఫోబియా పట్టుకుంది. జనం సొమ్మును అడ్డంగా దోచుకుని ఆస్తులు పెంచుకుంటున్న బల్దియా కేటుగాళ్ల బండారాన్ని బయటపెట్టింది ఏసీబీ. గత రెండు నెల్లలో ఆరుగురు బల్దియా అధికారుల అవినీతిని, అక్రమ సంపాదనలను బయటపెట్టిన ఏసీబీ ఇప్పుడు మిగతా తిమింగలాలపైనా కన్నేసింది. దీంతో కార్యాలయాలకు రాకుండా ఫీల్డువర్కులో ఉండిపోతున్నారు చాలా మంది బల్దియా అధికారులు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడిపోతున్నారు.
గ్రేటర్ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం GHMC భాద్యత. అయితే అధికారులు మాత్రం ఆ బాధ్యతను తమ ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా అధికారుల దోపిడీని చూసి సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. GHMC ఉద్యోగుల అడ్డగోలు ఆస్తులను చూసి నోరెళ్లబెడుతున్నారు. నిన్నమొన్నటివరకూ చిన్న చేపలనే పట్టుకున్న ఏసీబీ వలకు ఇప్పుడు భారీ అవినీతి తిమింగలాలు చిక్కుతున్నాయి.
GHMC, HMDA పరిధిలోని స్థలాలు, భవనాలను LRS, BRS స్కీం ద్వారా రెగ్యులరైజేషన్ చేయాలనుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని తమకు అనుకూలంగా మలచుకున్న అధికారులు అడ్డదిడ్డంగా దోచేశారు. ఇందులో టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి నగరాన్ని శుభ్రంగా ఉంచాల్సిన శానిటేషన్ విభాగం అధికారుల వరకూ అందరూ ఉన్నారు. ఏసీబీ సోదాల్లో అడ్డంగా దొరికిపోతున్నారు.
గత ఆర్నెల్లలో 11 మంది జీహెచ్ఎంసీ అధికారులు ఏసీబీకి చిక్కగా వారి నుంచి కోట్ల ఆస్తులు సీజ్ చేశారు అధికారులు. రెండు నెలల క్రితం ఖైరతాబాద్ సెంట్రల్ జోన్ ప్లానింగ్ అధికారి సంతోష్ వేణు ఇంట్లో సోదాలు చేసిన అధికారులు నగరంలో ఆయనకున్న బహుళ అంతస్తుల ఇళ్లతోపాటూ వెనకేసిన బంగారాన్ని చూసి షాకయ్యారు. తాజాగా ఆబిడ్స్ బిల్ కలెక్టర్ నర్సింహా రెడ్డి భారీగా కూడబెట్టిన అక్రమ ఆస్తులను లెక్కించే పనిలో పడ్డారు.
జీహెచ్ఎంసీలోని అన్ని శాఖల అధికారులపైనా నిఘా పెట్టిన ఏసీబీ.. ఏ క్షణమైనా వారి ఇళ్లలో సోదాలకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్లో ఉన్నారు ఎక్కువమంది అధికారులు.... కార్యాలయాలకు రాకుండా ఫీల్డ్ వర్క్ పేరుతో ఎక్కువ బయటే తిరుగుతున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌లా మారిన జీహెచ్ఎంసీని ప్రక్షాళన చేస్తామని కమీషనర్ నుంచీ మంత్రి వరకూ అందరూ చెబుతున్నా.. అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఏసీబీ బయటపెట్టిన బల్దియా తిమింగలాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

